FbTelugu

వీళ్లుకదా నాయకులంటే..!

పదవి కోసం నానా గడ్డితినే నాయకులున్న ఈ పరిస్థితుల్లో తమతో విభేదించే వారి ద్వారా వచ్చిన పదవులను వదులుకొని రాజకీయానికి కొత్త అర్ధం చెప్పిన నేతలున్నారంటే ఆశ్చర్యం కలుగుతోంది కదా. అలాంటి వారు ఇప్పుడెవరున్నారండీ.. పదవి కోసం ఎవరి కాళ్లమీద పడుతున్న నేటి కాలంలో ఇలాంటి వాళ్లు ఉంటారనుకోవడం అత్యాశే అనుకుంటున్నారు కదా.

కానీ, మీ అత్యాశను కూడా నిజం చేశారు కేరళకు చెందిన సీపీఎం నాయకులు. రాజకీయ పార్టీల మధ్యన సైద్ధాంతిక విభేదాలుండడం సహజం. కానీ, పదవి కావాల్సి వస్తే మాత్రం వీటిన్నింటినీ పక్కనబెట్టి వారిద్దరూ ఒక్కటి కావడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ, కేరళలో నలుగురు సర్పంచులు తమ ప్రత్యర్థులు తమకు ఓటు వేయడం వల్ల వచ్చిన సర్పంచు పదవులకు రాజీనామా చేశారు. సైద్ధాంతికంగా తాము వ్యవహరించే వారి మద్దతు తాము తీసుకొని పదవుల్లోకి రావడం తమకు ఇష్టం లేదని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమికి అక్కడ యూడీఎఫ్‌తో పాటు ఎస్‌డీపీఐలతో ముందునుంచీ సైద్ధాంతిక విభేదాలున్నాయి. అనివెస్పరి గ్రామంలో జరిగిన సర్పంచ్‌ స్థానానికి జరిగిన ఎన్నికలో సీపీఎం అభ్యర్థికి పూర్తి మెజారిటీ రాలేదు. అయితే, ఇక్కడ యూడీఎఫ్‌ సభ్యులు సీపీఎంకు అనుకూలంగా ఓటు వేయడంతో సీపీఎం అభ్యర్థి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే, మొదటి నుంచి తాము వ్యతిరేకిస్తున్న యూడీఎఫ్‌ సభ్యుల మద్దతుతో సర్పంచ్‌గా కొనసాగడం ఇష్టం లేదని సీపీఎం నుంచి ఎన్నికైన సర్పంచ్‌ రాజు వెంటనే తన పదవికి రాజీనామా చేశారు.

అదేవిధంగా తిరువనందూరులో బీజేపీ పెద్ద పార్టీగా ఎన్నికైంది. అయితే సర్పంచ్‌ స్థానానికి జరిగిన ఎన్నికలో ఎల్‌డీఎఫ్‌కు యూడీఎఫ్‌ సభ్యులు ఓటు వేశారు. దీంతో ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించింది. ఇక్కడ కూడా ఎల్‌డీఎఫ్‌ సర్పంచ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇక కొట్టంగల్‌ గ్రామంలో సీపీఎం–బీజేపీలకు సమానంగా వార్డు స్థానాలు వచ్చాయి. ఇక్కడ సీపీఎంకు యూడీఎఫ్‌తో పాటు మతతత్వ పార్టీ అయిన ఎస్‌డీఎఫ్‌ఐ ఓటు వేయడంతో సీపీఎం అభ్యర్థి సర్పంచ్‌గా విజయం సాధించారు. కానీ, వారి ఓటుతో గెలవడం ఇష్టంలేని సీపీఎం సర్పంచ్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. సీపీఎం కోరకపోయినా ఈ గ్రామాల్లో యూడీఎఫ్, ఎస్‌డీపీఐలు తమకు ఓటేశారని, తమకు ఆ పార్టీల మద్దతు అవసరం లేదంటూ ఎన్నికైన సర్పంచులు పదదవులకు వెంటనే రాజీనామా చేసి కొత్త ఒరవడికి నాంది పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.