FbTelugu

స్వాధీనం సరే.. చికిత్స ఎలా..?

ఇటీవల కాలంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బాధితుల నుంచి లక్షలకు లక్షలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కనీసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌లను కూడా అనుమతించడం లేదు. ఆసుపత్రికి వెళ్లగానే ముందు కనీసం ఐదు లక్షల రూపాయలు డిపాజిట్‌ చేయాలంటూ కండిషన్‌ పెడుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు ప్రభుత్వానికి రోజూ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వాస్తవానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఎంత తీసుకోవాలో ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయించింది. కానీ, వాటిని ఏ ఆసుపత్రి కూడా పట్టించుకోవడం లేదు. కరోనా చికిత్సకు పదివేల రూపాయలు కూడా కావని ఒకవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెబుతుంటే.. ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం కనీసం 5లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. నిబంధనలకంటే ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల్లో సగం బెడ్లను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుందని ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, బెడ్లను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని వాటిలో కరోనా బాధితులను చేరుస్తుంది.

కానీ, ఆ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు వైద్యం ఎలా చేయిస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణవాసుల్లో ఉదయిస్తోంది. ఇప్పటికే రోగులకు సరైన వైద్యం అందడం లేదన్న విమర్శలున్నాయి. తమ ఆసుపత్రుల్లోని సగం బెడ్లను ప్రభుత్వం తీసుకుంటే.. ప్రైవేటు ఆసుపత్రుపై భారీ స్థాయిలో దెబ్బ పడుతుంది. కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ ఆసుపత్రుల్లో చేర్పించిన రోగులకు అక్కడి డాక్టర్లు వైద్యం సరిగా చేస్తారా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కఠిన చర్యలతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు రోగులను పట్టించుకోకుండా గాలికొదిలేస్తే పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై కూడా ప్రభుత్వం వివరణ ఇస్తే బాగుంటుందని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

You might also like