FbTelugu

వారి పరిస్థితి ఏమిటో!

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు అన్నిదేశాలూ విశ్వప్రయత్నం చేశాయి. ఆ యుద్ధంలో గెలిచేందుకు ఎన్నో కష్టాలు పడి వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఆ వ్యాక్సిన్‌ ఇప్పుడు అందుబాటులో వచ్చింది. ఇండియాలో కూడా వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతోంది. తెలంగాణలో కూడా వ్యాక్సినేషన్‌ వేసేందుకు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకొంది. దాదాపు అన్ని ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే లక్షల మంది మొదటి, రెండు డోసులు వేసుకున్నారు. కరోనా వారియర్స్‌ తర్వాత మొదట్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, 60 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు ఇచ్చారు. ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన వారికి కూడా టీకాలు వేస్తున్నారు. 40 సంవత్సరాలు ఉన్న వారికి కూడా టీకాలు వేసే ప్రయత్నాల్లో ప్రభుత్వాలున్నాయి. తెలంగాణలో ప్రధానంగా కోవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలను వేశారు. టీకాల్లో ఉన్న నిబంధన ఏంటంటే మొదటి డోసు వేసుకున్న వారు నెల రోజుల లోపు రెండో డోసు కూడా వేసుకోవాలి. మొదట విడత వేసుకున్న టీకానే (కోవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌) రెండో డోసుకూడా వేసుకోవాలి. కానీ, ఇప్పుడు ఇదే నిబంధన మొదటి విడత టీకా తీసుకున్న వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మొదటి విడతలో చాలామంది కోవాగ్జిన్‌ టీకాను వేసుకున్నారు. రెండో విడత కోవాగ్జిన్‌ వేసుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లిన వారికి ఆ టీకా అందుబాటులో లేదు.. తర్వాత రండి అని డాక్టర్లు తిరిగి వెనక్కి పంపుతున్నారు. ఇప్పటికే మొదటి టీకా వేసుకొని నెలరోజులు దాటిన వారున్నారు.

నిబంధనల ప్రకారం మొదటి విడత వేసుకున్న నెల రోజులకు టీకా వేసుకోవాలి. కానీ, నెల దాటినా కోవాగ్జిన్‌ అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం అవుతుంది. దీనివల్ల రెండో టీకా ఆలస్యం అవుతుండడంతో మొదటి టీకా పని చేయకుండా పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే కోవాగ్జిన్‌ టీకా దొరకడం లేదు. కేంద్రం కూడా దీనిని సరిపోను సరిపోవడం లేదు. ఇప్పుడు అన్ని ఆసుపత్రుల్లో కొవిషీల్డ్‌ మాత్రమే దొరుకుతోంది. కొత్తగా వేసుకునే వారికి కొవిషీల్డ్‌ వేస్తున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, మొదటి విడత కోవాగ్జిన్‌ వేసుకున్న వారి పరిస్థితే రెంటికి చెడ్డ రేవడిలా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోవాగ్జిన్‌ టీకాను దేశంలోని ప్రజలకు అందుబాటులో ఉంచకుండా కేంద్రం ఇతర దేశాలకు సరఫరా చేస్తోందని, దేశ ప్రజల క్షేమం కంటే వ్యాపారమే ముఖ్యమన్న ధోరణిలో కేంద్ర నిర్ణయం ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం మొదటి విడత టీకా వేసుకున్న వారికైనా రెండో విడత అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే అది తమ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న భయాందోళనలో ఉన్నారు. మరి దీనిపై సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం.

You might also like

Leave A Reply

Your email address will not be published.