FbTelugu

ఇలా జరిగిందేబ్బా..!

ఏపీలో అధికార పక్షానికి ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకుంది. ఒకటి ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రూపంలో ఉంటే.. మరోటి టీడీపీ అవినీతి విధానాలకు ఉదాహారణగా చూపిన పోలవరం అంశం. ఈ రెండూ ఇప్పుడూ జగన్‌ శిబిరంలో టెన్షన్‌ రేపాయి. కొంతకాలంగా వైసీపీకి చెందిన నరసరాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ విధానాలకు, ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏం చేయాలన్న నిర్ణయంపై ఆ పార్టీ పెద్దలు చాలాకాలం తర్జనభర్జన పడ్డారు. చివరకు ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అయితే, ఆ ఎంపీ షోకాజ్‌ నోటీసుకు సమాధానంలా కాకుండా ఆయనే పార్టీకి షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్టుగా లేఖ పంపారు. ఆ లేఖలో ఆయన అనేక టెక్నికల్‌ విషయాలు ప్రస్తావించారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా గెలిచానని.. కానీ, తనకు షోకాజ్‌ నోటీసు ఆ పార్టీ లెటర్‌హెడ్‌ ద్వారా కాకుండా మరో పేరుతో (వైఎస్సార్‌ సీపీ) ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం దీనిపై చర్య తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా దీనివల్ల పార్టీ గుర్తింపు కూడా రద్దవుతుందని హెచ్చరించారు. తమ పార్టీని ఎన్నికల సంఘం ప్రాంతీయ పార్టీగా గుర్తించిందని.. అయితే తనకిచ్చిన నోటీసులో విజయసాయిరెడ్డి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేర్కొన్నారని, పైగా రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి లోక్‌సభ సభ్యుడినైన తనకు నోటీసు ఎలా ఇస్తారని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖను చూస్తే పార్టీకి ఆయన వివరణ ఇవ్వడం కాదు.. పార్టీనే ఆయనకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు తలలు పట్టుకుంటున్నారు.

చంద్రబాబుకు క్లీన్‌చిట్‌తో..

ఇకపోతే చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందన్న విషయాన్ని జగన్, ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒక్క పోలవరం నిర్మాణంలో లక్షల కోట్లు పక్కదారి పట్టాయని, తాము అధికారంలోకి వస్తే అవి తిరిగి ప్రభుత్వానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్నట్టే వారు అధికారంలోకి వచ్చారు. వెంటనే తమ దృష్టిని పోలవరంపై నిలిపారు. దానిపై రివర్స్‌ టెండరింగ్‌ చేసి దానిని తనకు అనుకూలంగా ఉన్నవారికి కాంట్రాక్టును కట్టబెట్టారు సీఎం జగన్‌. కానీ, ఇప్పుడు ఈ విషయంలోనూ ఆ పార్టీకి సీన్‌ రివర్స్‌ అయింది. పోలవరం నిర్మాణంలో అవినీతి లేదని కేంద్రం చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. పోలవరంలో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని, అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రకటించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. దీనికితోడు ఇటీవల కాలంలో జగన్‌ నిర్ణయాలను తప్పుపడుతూ కోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసింది. దీంతో జగన్‌కు ఏం చేయాలో తోచడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. పోలవరం విషయంలో జగన్‌తో పాటు పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర స్థాయిలో డీలా పడ్డాయని జోరుగా ప్రచారం సాగుతోంది. పోలవరం విషయంలో కేంద్రం చంద్రబాబు ఇచ్చిన క్లీన్‌చిట్‌ విషయంలో వారు చేసిన కామెంట్ల కంటే చంద్రబాబు, మోదీ మళ్లీ దగ్గరవుతున్నారా అన్న అనుమానమే ఆ పార్టీ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తుందని వైసీపీ శ్రేణులు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. ఏదైమైనా సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే జగన్‌ సర్కారుకు ఇన్ని కష్టాలు మొదలయ్యాయని, మున్ముందు పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయోనని వారు చెవులు కొరుక్కుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.