1982 తెలుగుదేశం పార్టీ పుట్టేంత వరకూ ఒక లెక్క.. ఆ తరువాత రాజకీయం మరోలెక్క. ఉమ్మడి ఏపీలో కమ్మ సామాజికవర్గం ఆర్ధికంగా, విద్యాపరంగా ఎదిగేందుకు నందమూరి తారకరామారావు టీడీపీ కారణమంటూ ఇప్పటికీ లెక్కలు వేస్తుంటారు. వాస్తవానికి 1980 దశకంలో కమ్మ వర్గం గ్రామీణ ప్రాంతాల్లో జమీందారి వారసత్వంలో నడుస్తున్నారు. వ్యవసాయ భూములు వేలాదిఎకరాలకు యజమానులుగా ఉన్నారు. విద్యాపరంగా కూడా పాఠశాలల ఏర్పాటు చేసి విద్యకు ఊతమిచ్చారు. పల్లెపట్టున కూలీనాలీలకు పనిదొరికేది. అయితే అప్పటి వరకూ రాజకీయాల్లో కేవలం రెడ్డి, బ్రాహ్మణ వర్గాలు కీలకంగా ఉండేవి.
స్వాతంత్ర పోరులో పాల్గొన్న నాటి నేతలు , వారి స్పూర్తితో ప్రజాసేవలో ఉన్నవారికి మాత్రమే రాజకీయాలు, పదవులు దక్కేవి. 1982లో టీడీపీ ఏర్పాటులో నందమూరి తారకరామారావు వెనుక కుల పెద్దలు చక్రం తిప్పినా.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టడంలో విజయం సాధించారు. అలా..ఉమ్మడి ఏపీలో పల్లెలు, చిన్నపాటి పట్టణాల్లోని కమ్మ వర్గ పెద్దలు తెలుగుదేశం జెండాకు భుజం కాశారు. కాంగ్రెస్‌లో రెడ్లకు పదవులు ఎంతగా కట్టెబెట్టారో.. టీడీపీలోనూ కమ్మలకే మొగ్గుచూపుతూ వచ్చారు. 1989లో కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా హత్యతో అది పతాకస్థాయికి చేరింది. అలా.. కమ్మ వర్సెస్ కాపు అనేంతగా వంగవీటి, దేవినేని అనే రెండు కుటుంబాల గొడవ కాస్తా.. రెండు కులాల వైరంగా మారింది. ఆ నాటి గొడవల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యాపారాలు, దుకాణాలు, సినిమా థియేటర్లను తగులబెట్టేంత వరకూ చేరింది. 2004లో దీన్ని చక్కగా వాడుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాపులను దగ్గర చేసుకున్నాడు. కమ్మ వ్యతిరేకతను ఓటుబ్యాంకుగా మలచుకున్నాడు. 2014లో వైసీపీ విజయం దాదాపు ఖరారైనా.. చివర్లో పవన్ కళ్యాణ్‌తో దోస్తీ చేయటం ద్వారా చంద్రబాబు కాపు ఓటర్లను టీడీపీ వైపు మరల్చుకున్నాడు. కానీ..కాపులకు ఇస్తానని హామినిచ్చిన బీసీ రిజర్వేషన్ దాటేశాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. అప్పటికే కాపు కార్పోరేషన్లో అవినీతి, నిధుల మళ్లింపుతో చివరి వరకూ కేటాయించిన నిధులు చేరలేకపోయాయి. జన్మభూమి కమిటీల అవినీతి, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల అక్రమాలు.. క్రమంగా టీడీపీ వరకూ పాకాయి. ఐదేళ్లకాలంలో దేశదేశాలు తిరిగి.. కొత్త రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలనే సంకల్పం.. పోలవరంతో తాగు, సాగునీటి కష్టాలు దూరం చేయాలనే చంద్రబాబు లక్ష్యాన్ని అవన్నీ నీరుగార్చాయి.
వారసుడుగా లోకేష్‌బాబు పక్కన చేరిన మందీమార్భలం కొన్ని విషయాలను బాబు వరకూ చేరకుండా ఆపేశాయి. ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసినా సరిదిద్దుకునే ప్రయత్నాలు పూర్తిగా విస్మరించారు. అదే సమయంలో జగన్ కూడా ఒక్కఛాన్స్ అంటూ చేసిన ప్రచారం.. అమరావతిని కొనసాగిస్తానంటూ హామీ. నవరత్నాల పేరిట అన్నివర్గాలను ఆకట్టుకోవటం చాపకింద నీరులా టీడీపీ పట్ల మరింత వ్యతిరేకతను పెంచేలా చేశాయి. అమరావతి కేవలం కమ్మ వర్గానిదే అని మిగిలిన సామాజికవర్గాల్లో బలంగా నాటుకుపోయింది. వాస్తవానికి
అమరావతి రాజధానిగా ఉన్న ప్రాంతం తాడికొండ నియోజకవర్గం. అక్కడ ప్రస్తుతం ఎస్సీ వర్గం ప్రాతినిధ్యం కిందకు వస్తుంది. కాపులు, ఎస్సీలు, మైనార్టీలు కూడా ఉంటారు. కానీ.. భూములు ఇచ్చిన వారిలో ఎక్కువశాతం కమ్మవర్గానికి చెందిన వారు కావటం… విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా ఇక్కడ భూములు కొనటం.. ఇలా.. ప్రతి చోట.. అమరావతి వల్ల లాభపడేది
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కమ్మ వర్గమే అనే విషయం మిగిలిన సామాజికవర్గాల్లో టీడీపీ పట్ల వ్యతిరేకతను రెట్టింపు చేసింది. చివరకు అమరావతి మాది కాదనే అభిప్రాయం బలంగా నాటుకునేలా చేసింది. అందుకే.. 200 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా.. అధికశాతం ప్రజల నుంచి అంతగా స్పందన రావట్లేదు. రూ9000 కోట్లు ఖర్చుచేశానంటూ చెబుతున్న చంద్రబాబు మాటలను నమ్మట్లేదంటూ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు.