గ్రామాల్లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే చూస్తుంటాం. ఆటకు వచ్చిన పిల్లలంతా కలిసి రెండు టీములుగా విడిపోతారు. అలా సమానంగా రెండు టీములైన తర్వాత ఒకరు మిగిలితే.. ఆ ఒక్కడినీ రెండు టీములలో బ్యాటింగ్ చేసేలా నిర్ణయించుకొని ఆడించుకుంటాం. సరిగ్గా ఇలాగే వ్యవహరించింది ఓ రాజకీయ పార్టీ. అదే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ. ఇంతకీ దేని గురించి ఇదంతా అనుకుంటున్నారు కదా.. అదేనండి ఇప్పుడు దేశంలో అట్టుడుకుతున్న రైతుల పోరాటం గురించి.
పార్లమెంటులో కేంద్రం వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టి చట్టం చేసింది. దానివల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుందని రైతులు ఏకంగా ఢిల్లీని ముట్టడించారు. వేలాది మంది కొన్ని రోజులుగా ఆందోళనకు దిగారు. చివరకు ఢిల్లీ ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోంది. కానీ, అవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే, ఇందులో ట్విస్ట్ ఏంటంటే కేంద్రం వ్యవసాయ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ చట్టాలకు అనుకూలంగా వైసీపీ ఎంపీలు ఓటు వేశారు. ఆ చట్టాలకు బహిరంగంగా మద్దతు పలికారు. కానీ, ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా భారీగా పోరాటం జరుగుతుండడంతో అంతా తూచ్ అని నాలుక్కరుచుకున్నారు. బీజేపీ కోసం తాము తప్పు చేశామని భావించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆ తప్పులను కప్పి పుచ్చుకునే పనిలో పడ్డారట. అందులో భాగంగానే డిసెంబర్ 8న వామపక్షాలు, రైతుసంఘాలు నిర్వహించిన దేశవ్యాపిత సమ్మెకు వైసీపీ కూడా మద్దతు పలికింది.
ఇది చూసిన జనం మాత్రం అమ్మ నా జగనా అనుకుంటున్నారు. చట్టం చేసినపుడు వాటికి అనుకూలంగా ఓటు వేసి.. ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతు ఇచ్చి చట్టానికి వ్యతిరేకం అని చెప్పడంలో ఏం లాజిక్ ఉందోనని ఆశ్చర్యపోతున్నారు. వ్యవసాయ చట్టాలపై వైసీపీ రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తోందని, ఇది ప్రజలను మోసం చేయడమేనని ప్రతిపక్ష పార్టీలు వారిపై దుమ్మెత్తిపోస్తున్నాయి.