FbTelugu

కేసీఆర్‌కు ఏమైంది..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాజకీయాల్లో ఆయనది ఓ ప్రత్యేక స్థానం. తాను చావు నోటిలో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించానని చెబుతారు. అంతేకాదు.. నేను మాటిస్తే దానిని తప్పను.. ఆరు నూరైనా దానిని చేస్తా తప్ప వాటిని వదిలేయను.. అవసరమైతే తల నరక్కుంటా కానీ మాట తప్పను అని రెగ్యులర్‌గా చెబుతుంటారు. సాధారణంగా కేసీఆర్‌ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదని.. ఎవరు చెప్పినా దానిని మార్చుకోరని కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉన్న వారు చెబుతుంటారు. అలాంటి కేసీఆర్‌కు ఇప్పుడేమైంది అన్న ప్రశ్న రాష్ట్రమంతా వినిపిస్తోంది. ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆయనే మార్చుకుంటున్నారని.

ఇది ఆయన సహజ లక్షణానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్రం రైతు బిల్లులను తీసుకువచ్చింది. దీనిపై కొన్ని రాష్ట్రాల రైతులు ఢిల్లీకి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు, పలు రైతుసంఘాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, కేసీఆర్‌ కూడా రైతులకు మద్దతుగా.. కేంద్రం బిల్లులకు వ్యతిరేకంగా ఆ బంద్‌లో పాల్గొన్నారు. కేవలం బంద్‌లో పాల్గొనడమే కాదండోయ్‌.. అసలు బంద్‌కు పిలుపునిచ్చింది కేసీఆర్‌.. టీఆర్‌ఎస్సే అన్నంత గొప్పగా బంద్‌లో పాల్గొన్నారు. మంత్రులతో పాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి బంద్‌ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కేంద్రం బిల్లులపై విమర్శనాస్త్రాలు సంధించారు. అసలే బీజేపీపై ఆగ్రహంతో ఉన్న టీఆర్‌ఎస్‌ ఈ బంద్‌ పేరుతో కమలనాథులపై ఒంటికాలిపై లేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారికి తాము అండగా ఉంటామని కూడా చెప్పారు. కానీ, ఈ మాటలు నాలుగు రోజులే.. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని కలిసేంతవరకే ఈ ఆందోళనలు, హామీలు ఉన్నాయి. వారిని కలిసిన తర్వాత ఇవన్నీ అటకెక్కాయి. ఆయన ఢిల్లీనుంచి రాగానే ఇప్పటి వరకు వ్యతిరేకించిన రైతు బిల్లులను కేసీఆర్‌ సమర్ధించారు.

అంతేకాదు వచ్చే పంటను అమ్ముకోవడంలో కీలకపాత్ర వహిస్తున్న గ్రామ కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదండోయ్‌.. ఆయన ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎత్తివేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం కొద్ది కాలంలోనే కేసీఆర్‌ తన నిర్ణయాల నుంచి యూ టర్న్‌ తీసుకోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇటీవల ఆయన పార్టీకి తగిలిన ఎదురుదెబ్బల నుంచి తీసుకున్న పాఠాలు ప్రజల మనస్సును గెలిచేలా కాకుండా మిగతా పార్టీల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకుంటూ ప్రజలను పక్కదారి పట్టేలా చేస్తున్నారని. దీనివల్ల ఆయన మరింతగా ప్రజల నుంచి దూరం కావడం తప్ప లాభమేమీ లేదని.. ప్రజల వైపు నిలబడితేనే వారి మనసు గెలుచుకుంటారని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా చెబుతున్నారు. ఇటీవల కేసీఆర్‌లో వచ్చిన మార్పును చూసిన వారు మాత్రం కేసీఆర్‌కు ఏమైంది అని ఆశ్చర్యపోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.