FbTelugu

పల్లా.. ఏమిటిలా..?

special-focus-on-palla-rajeshwar-reddy

పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఈయన టీఆర్‌ఎస్‌ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్, శాసనమండలిలో ప్రభుత్వ విప్, పైగా ప్రముఖ విద్యావేత్త, ఇంజనీరింగ్‌ కాలేజీల యజమాని. టీఆర్‌ఎస్‌ అధినేతకు తలలో నాలుకలాంటి వ్యక్తి. అయితే, ఇటీవల పార్టీలో కొన్ని పరిణామాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. ఇవి యాధృచ్చికంగా జరుగుతున్నాయా.. లేక పార్టీలోని కొందరు పెద్దలు కావాలని చేస్తున్నారా.. అన్న అనుమానం ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. అయితే, అధినేతకు దగ్గరగా ఉన్న ఓ మంత్రి అతడిపై కన్నేశారని.. కావాలనే ఆయనకు చెక్‌ పెట్టేలా పావులు కదుపుతున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తోంది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయాలని కోదాడ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అనూహ్య పరిణామాల్లో భాగంగా టీడీపీ టికెట్‌ దక్కని బొల్లం మల్లయ్య యాదవ్‌ను సదరు మంత్రి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి పార్టీ టికెట్‌ ఇప్పించినట్టు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పల్లా మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అది కూడా చేతికందలేదు. పైగా ఇటీవల మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో పరిశ్రమల హబ్‌ ప్రారంభానికి ఆయనను కనీస మర్యాదకోసం కూడా పిలవలేదు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు ఆహ్వానం రాకపోవడం, శిలాపలకంపై ఆయన పేరు లేకపోవడం ఆయనకు అవమానకరంగా మారింది.

పల్లాకు మంత్రి చెక్‌ పెడుతున్నారా..

పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓ మంత్రి చెక్‌ పెడుతున్నారని ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. గత సాధారణ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతను ఓ మంత్రికి పార్టీ అప్పగించింది. కానీ, ఆయన అక్కడ అభ్యర్థిని గెలిపించడంలో ఫెయిలయ్యారు. అయితే, అదే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పార్టీ మంత్రిని కాదని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ ఎన్నికలో ఆయన పార్టీ అభ్యర్థిని రికార్డుస్థాయి మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టారు. దీంతో పల్లాకు పార్టీలో ఎక్కడ తనకంటే ఎక్కువ పేరొస్తుందో అనే అనుమానంతో అతడిని దూరం పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో కీలక స్థానంలో ఉన్న ఓ నేతకు, మంత్రికి మధ్య పొరపచ్చాలున్నాయన్న విషయం పార్టీ కార్యకర్తలందరికీ తెలిసిందే. అయితే, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండలిలో కీలకంగా ఉన్న నేతకు దగ్గరగా ఉండడం కూడా సదరు మంత్రికి నచ్చలేదని, ఈ కారణాలతోనే పల్లాకు చెక్‌పెట్టేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు గులాబీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.

షేక్‌. మస్తాన్‌బీ, హైదరాబాద్‌

You might also like