తాడేపల్లి: కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న మూడు జిల్లాల్లో కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం ఆళ్లనాని తెలిపారు.
రోగుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రుల సంఖ్యను పెంచి, మెరుగైన సదుపాయాలు కల్పించామని ఆయన అన్నారు. బుధవారం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్.జగన్ ఆదేశించారన్నారు.
లాక్డౌన్ సమయంలో టెలీమెడిసిన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారని చెప్పారు. కుటుంబ సమగ్ర సర్వేలో గుర్తించిన ప్రతి ఒక్కరికీ.. వెంటనే వైద్య పరీక్షలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాళ్లందరినీ వెనక్కి తీసుకొచ్చే చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కచ్చితంగా ఓపీ సేవలు అందించాలని, అందించడం లేదని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తన పేషీలో అటెండర్ కు కరోనా
తన పేషీలో పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆళ్ల నాని వెల్లడించారు. అటెండర్‌కు కరోనా రావడంతో తనతో సహా పేషీలో పనిచేసే 13 మందికి టెస్టులు చేశారని తెలిపారు. అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు.