FbTelugu

వరి నాట్లేసి, అరక దున్నిన ఎస్పీ రమేష్ రెడ్డి

చిన్నప్పుడే భాషతో పాటు వ్యవసాయం నేర్పాలి

తిరుపతి: డ్యూటీలో భాగంగా వెళ్తున్న పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కి పొలంలో వరి నాట్లు వేస్తున్న దృశ్యం కన్పించింది. ఒక్కసారిగా ఆయన చిన్ననాటి స్మృతుల్లోకి వెళ్లిపోయారు.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొలాల్లోకి దూకారు. ఆయనే తిరుపతి అర్బన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి. ఏర్పేడు-వెంకటగిరి రోడ్డు పక్కన కొంత మంది కూలీలు యజమానితో కలిసి వరి నాటుతున్నారు. ఇది గమనించిన రమేష్ రెడ్డి వెంటనే తన వాహనాన్ని ఆపేసి, బూట్లు ఇప్పేసి, ప్యాంట్ పైకి పెట్టుకుని పొలాల్లోకి వెళ్లారు. కూలీల నుంచి వరి నారు తీసుకుని నాటడం మొదలుపెట్టారు. ఇది చూసిన కూలీలు ముచ్చటపడ్డారు.

sp of tirupathi urban

నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదివానని, నేను రైతు బిడ్డనే అని అన్నారు. ఈ రోజు నోటి నిండా ఆహారం తింటున్నామంటే రైతు వల్లనే అని అన్నారు. మహమ్మారి కరోనా తో ప్రపంచం అతలాకుతలం అవుతుండగా, ఆడుతూ పాడుతూ కూలీలు పనిచేస్తున్నారన్నారు. యువత వారాంతంలో సినిమాలకు, షికార్లకు వెళ్లే బదులు గ్రామాలకు వెళ్లి రైతాంగానికి తోడ్పాటునిస్తే ప్రతి ఊరి పచ్చగా ఉంటుందని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.

పుట్టుకతో ప్రతి ఒక్కరికి మాతృ భాష ఏలా నేర్పిస్తామో వ్యవసాయం గురించి కూడా కచ్చితంగా నేర్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తరువాత ఆయన కూలీలు, రైతులకు నిత్యావసర సరకులతో పాటు పండ్లు, కూరగాయలు అందచేశారు.

You might also like