FbTelugu

నేనున్నాను…విద్యార్థులకు సోనూసూద్ భరోసా!

ముంబై: జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించడంతో యాక్టర్ సోనూసూద్ రంగంలోకి దిగారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ఒత్తిడి మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ స్పష్టం చేశారు.

అయితే వరద ప్రాంతాలు, రవాణా సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు అండగా నిలవాలని సోనూసూద్ నిర్ణయం తీసుకున్నారు. బిహార్ రాష్ట్రంలో సుమారు 13 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. కరోనా వైరస్, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో తాము పరీక్షలకు వెళ్లలేకున్నామని, సాయం చేయాలని పలువురు విద్యార్థులు సోనూ ను వేడుకుంటున్నారు.

నీట్, జేఈఈ పరీక్షా కేంద్రాలు ఖరారు అయితే విద్యార్థులకు కావాల్సిన రవాణా సౌకర్యం కల్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా బిహార్, అస్సాం, గుజరాత్ వరదల్లో చిక్కుకున్న విద్యార్థులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరైనా హాజరు కాకుండా విపత్కర పరిస్థితుల్లో ఉంటే సమాచారం ఇవ్వాలని, ఏ ఒక్కరు కూడా పరీక్షకు మిస్ కాకూడదని సోనూసూద్ ట్వీట్ చేశారు.

You might also like