FbTelugu

అంత పరిహారమా.. ఏం చేసుకోవాలో?

రైతులంటే ప్రభుత్వాల దగ్గర నుంచి దళారుల దాకా.. అధికారుల నుంచి వ్యాపారుల దాకా అందరికీ చులకనే. వారి కష్టాలు పట్టించుకునే వారే కరువయ్యారు. ఆరుగాలం కష్టపడి తిండి, నిద్రలేక చెమట చుక్కలు చిందించి సేద్యం చేస్తే చివరకు ప్రకృతి కూడా రైతును ఆదుకోవడం లేదు. అతివృష్టి, అనావృష్టితో పంటనంతా పాడు చేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి రైతుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు పంట బీమా పథకాలను నిర్వహిస్తున్నాయి. కానీ, అధికారుల నిర్లక్ష్యం పంట నష్టపోయిన రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన యావత్‌ దేశాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పంటల బీమా కోసం ఓ పథకాన్ని నిర్వహిస్తోంది. దీనికోసం రైతుల నుంచి ఏడాదికి రూ.1,050 ప్రీమియం వసూలు చేస్తోంది. అయితే, ఇటీవల వర్షాలకు అక్కడ పంట దెబ్బ తిన్నది. దీంతో బీమా కింద 22లక్షల మంది రైతులకు బీమా చెల్లించింది. అందులో పురాన్‌లాల్‌ రైతుకు పంట నష్టం కింద కేవలం ఒక్క రూపాయి మాత్రమే వచ్చింది. దీంతో అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. తాను బీమా కోసం వెయ్యి రూపాయలు కడితే ఇప్పుడు నాకు ఒక్క రూపాయి మాత్రమే వచ్చింది. ఇదెక్కడి అన్యాయం అని నెత్తీనోరు బాదుకుంటున్నాడు. అంత పెద్ద మొత్తం వచ్చింది. దానిని ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి అంటూ హేళన చేస్తున్నాడు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల తాను నిండా మునగాల్సి వచ్చిందని వాపోతున్నాడు. బీమా సంస్థ ఇచ్చిన ఆ రూపాయి పరిహారం తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేస్తానని చెబుతున్నాడు. చూశారా.. రైతులంటే ఎంత చులకనగా తయారైందో. ఇప్పటికైనా బీమా సంస్థ, ప్రభుత్వం తమ తప్పును తెలుసుకొని రైతుకు ఇవ్వాల్సిన నష్టపరిహారం మొత్తం చెల్లిస్తారో లేదో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.