FbTelugu

రెంటికి చెడ్డ రేవడిలా..!

కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఒక పార్టీ నుంచి గెలిచారు.. మరో పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన వెంటనే జనం చీత్కరించారు. ఇప్పుడు తమ దారెటో తెలియక అమోమయంలో పడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మహేశ్వరం, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యేలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా పోటీచేసి విజయం సాధించారు. అనంతర పరిణామాల్లో వారు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి అధికార పార్టీలోకి జంప్‌చేసి కారెక్కారు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ను వీడి కారెక్కడంతో ఆమెకు మంత్రి పదవి లభించింది. ఇక, ఎల్‌బీనగర్‌ నుంచి విజయం సాధించిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా కారెక్కారు.

వీరు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నంతవరకు వీరి ప్రాంతాల్లో మంచి పట్టు కలిగి ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా దేవిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్‌బీనగర్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని మెజారిటీ వచ్చింది. మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి విజయానికి ప్రధాన భూమిక పోషించింది. ఆయన విజయంలో సింహభాగం ఎల్‌బీ నియోజకవర్గానిదే. దేవిరెడ్డి అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒక్కస్థానాన్ని కూడా సాధించలేదు. పైగా నామమాత్రంగా కూడా లేని బీజేపీ ఇక్కడ పుంజుకోవడమే కాదు. ఏకంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లనూ కైవసం చేసుకొని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి, టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుధీర్‌రెడ్డికి 96,303 ఓట్లు రాగా బీజేపీకి కేవలం 21,563 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 86,090 ఓట్లు వస్తే బీజేపీకి 1,29,519 ఓట్లు సాధించి అన్ని స్థానాలనూ ఎగురవేసుకుపోయింది. ఇక, మంత్రిగా కొనసాగుతున్న సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి కూడా టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత అగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చావుతప్పి కన్ను లొట్టబోయినట్టుగా బయటపడింది. కానీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో ఒక్కటి కూడా టీఆర్‌ఎస్‌ సాధించలేక పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డికి వచ్చిన ఓట్లలో సగం కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు రాలేదు. ఇక రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇక్కడి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించింది టీడీపీ నుంచి. తదనంతరం ఆయన 2014 తర్వాత ఆయన టీడీపీని వదిలి టీఆర్‌ఎస్‌ బాట పట్టారు. 2018 ఎన్నికల్లో ఆయన తిరిగి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి దిగి విజయం సాధించారు. వాస్తవానికి ప్రకాష్‌గౌడ్‌కు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన మాటను కాదనేవారు చాలా తక్కువ. అలాంటి నాయకుడు కూడా ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డాడు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ నుంచి బరిలోకి దింపిన ఆయన సొంత తమ్ముడినే గెలిపించుకోలేక పోయారు. పైగా ఆయన అసెంబ్లీ పరిధిలోని ఒక్క డివిజన్‌ను కూడా టీఆర్‌ఎస్‌ సాధించలేకపోయింది.

ఈ నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన ప్రకాష్‌గౌడ్‌కు 1,08,964 ఓట్లు రాగా ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం కేవలం 42వేల 764 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పాటు పార్టీ మారి టీఆర్‌ఎస్‌లో చేరిన నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌కు ఓట్లు భారీగా తగ్గాయి. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 1,54,500 ఓట్లు రాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం 97,720 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో కూడా టీఆర్‌ఎస్‌కు భారీగా ఓట్లు తగ్గాయి. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటే ఏం చేయాలోనని మదన పడుతున్నారు. టీఆర్‌ఎస్‌లోనే ఉంది పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలా.. లేక గతంలో ఉన్న పార్టీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరినట్టుగానే ఇప్పుడు హవా నడుస్తున్న బీజేపీలో చేరాలా అన్న డైలమాలో ఉన్నారు. వీరి నిర్ణయమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.