FbTelugu

వారు ఇక మారరా..!

ఒక వ్యక్తి గానీ, ఒక సంస్థగానీ వరుసగా అపజయాలు చవిచూస్తుంటే దానికి కారణాలను విశ్లేషించుకొని వాటినుంచి బయటపడేందుకు కృషి చేస్తారు. అలా చేస్తేనే ఆ వ్యక్తి లేదా ఆ సంఘం మనుగడ సాగిస్తుంది. ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కూడా వరుసగా అపజయాలను కూడగట్టుకొంటుంది. కానీ, వాటిని విశ్లేషించుకొని పరిస్థితిని మెరుగుపరుచుకోవడంపై శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ పోటీచేసినా వరుసగా అపజయాల పాలవుతోంది. దీంతో పార్టీ క్యాడర్‌ కూడా దూరమవుతోంది. వారంతా వివిధ పార్టీల్లో చేరుతున్నారు. క్యాడరే కాదు నాయకులు కూడా తలా ఒకదారి చూసుకుంటున్నారు. అయినా, పార్టీ నేతల్లో చలనం లేకుండా పోయింది. ప్రభుత్వ విధానాలపై పోరాడాల్సిన నేతలు కిమ్మనకుండా ఇళ్లలో కూర్చున్నారు. వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఈ ఉద్యమంలో దాదాపు 300 మందికి పైగా అమరులయ్యారు. దీనికితోడు ఇటీవల కాలంలో కేంద్రం డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచుతోంది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నా వాటికి వ్యతిరేకంగా పోరాడడంలో కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్రంగా విఫలమయ్యాయి. తెలంగాణలో కూడా వివిధ సమస్యలపై ప్రజలు ప్రభుత్వ విధానాలతో విసిగిపోతున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నేతలు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో నానాటికీ ప్రజల్లో ఆ పార్టీ పలుచన అవుతుందని, అందుకే వరుస ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాలను మూటగట్టుకుందని ఆ పార్టీ కార్యకర్తలే విమర్శలకు దిగుతున్నారు.

ఒకరు ముందుకు వస్తే..
ప్రభుత్వాల విధానాలపై పోరాడి పార్టీకి జీవం పోసేందుకు రేవంత్‌రెడ్డి లాంటి నాయకులు ముందుకు వచ్చినా మిగతా నాయకులు రకరకాల కొర్రీలు పెట్టి వారి కాళ్లకు బంధాలు వేస్తున్నారన్న విమర్శలు కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలు చేస్తున్నారు. రైతు వ్యతిరేక బిల్లులపై తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. దాని ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభ కూడా సక్సెస్‌ అయింది. ఈ సభకు భారీగా జనం తరలిరావడంతో కార్యకర్తలో కొంత ఆశలు రేకెత్తాయి. అయితే, కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు ఆయనపై విమర్శలు చేయడంతో పాటు పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అయినా, సభ నిర్వహించి విజయవంతం చేశాడు. కానీ, అడుగడుగునా ఆయనకు ఆటంకాలు కలిగిస్తుండడంతో రేవంత్‌ ప్రజా పోరాటాన్ని తగ్గించారు. దీంతో మళ్లీ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరాశ మొదలైంది. జాతీయ స్థాయిలో కూడా పార్టీ నేతలు పోరాటాన్ని మరిచారు. కేంద్రంపై పోరాడే అవకాశాలు చాలావరకు అందివచ్చినా కేవలం మీడియాలో విమర్శలు చేయడం తప్ప ఎక్కడా ప్రత్యక్ష పోరాటాలకు దిగిన సందర్భాలు లేవు. దీంతో కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న నమ్మకాన్ని ప్రజలు, ఓటర్లు నానాటికీ కోల్పోయి ఇతర పార్టీలకు ఆకర్షితులవుతున్నారని, ఇప్పటికైనా కాంగ్రెస్‌ నేతలు ప్రజా పోరాటాలను ప్రారంభించకుంటే ఆ పార్టీ ఇంకా కనుమరుగు కావడం గ్యారంటీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి, కాంగ్రెస్‌ పెద్దల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి మరి.!

You might also like

Leave A Reply

Your email address will not be published.