అధికార పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొత్త గుబులు పట్టుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు చూశాక వారికి నిద్ర పట్టడం లేదట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 69మంది దాకా తిరిగి సిట్టింగులకే సీట్లు కేటాయించారు. కేవలం 30 మందికి మాత్రమే టికెట్ నిరాకరించారు. వారి స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దించారు. వాస్తవానికి టీఆర్ఎస్ సిట్టింగులపై ప్రజల్లో భారీగా వ్యతిరేకత ఉంది. అనేక సందర్భాల్లో అది వ్యక్తమైంది. చాలామంది కార్పొరేటర్లు దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డట్టు జోరుగా ప్రచారం అయింది. అనేకమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా టీఆర్ఎస్ అధిష్టానం తిరిగి సిట్టింగులకే టికెట్లు కేటాయించింది. అలా తిరిగి పోటీచేసిన వారిలో ఎక్కువమంది ఓటమిని చవిచూశారు. పాతవారి స్థానంలో బరిలోకి దిగిన కొత్తవారంతా గెలిచారు. దీంతో పార్టీ అధిష్టానంతో పాటు నాయకులు కూడా తమ తప్పును తెలుసుకున్నారు.
మరికొంతమంది సిట్టింగులను మార్చి ఉంటే ఎక్కువ స్థానాలు గెలిచేవారమన్న భావన గులాబీ బాస్ మదిలో కూడా ఉందట. ఇదే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి గుణపాఠాలను తీసుకుంటే సిట్టింగులపై తమకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు వస్తాయా రావో అన్న అనుమానంలో ఉన్నారట. తమ స్థానంలో కొత్తవారికి టికెట్లు ఇస్తే పరిస్థితి ఏమిటా అన్న ఆందోళనకు గురవుతున్నారట.