FbTelugu

సిరివెన్నెల ఇకలేరు…..

 

సిరివెన్నెల
సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం ఆగిపోయింది. న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల కన్నుమూశారు. నవంబర్ 24 నుంచి హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల ఆరోగ్యం.. గత రెండు రోజులుగా ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు సిరివెన్నెల.

1955 సంవత్సరం మే 20వ తేదీన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల.. బాలకృష్ణ హీరోగా కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయన అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. అయితే 1986లో కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలు రాసి ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పేరు తెచ్చుకున్నారు.

‘సిరివెన్నెల’ సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామ శాస్త్రి.. దర్శకుడు కె. విశ్వనాథ్‌తో కలిసి అన్ని సినిమాలకు పని చేశారు. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తుంటారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు. రామ్ గోపాల్ వర్మ, కృష్ణ వంశీ, కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు.

 

గత కొన్ని దశాబ్ధాలుగా అద్భుతమైన పాటలను రచించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు సిరివెన్నెల. ”స్వర్ణక మలం, గాయం, శుభ లగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెలకు నంది అవార్డులు వరించాయి.

కెరీర్లో ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డులు.. 4 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న ఆయనకు 2019 సంవత్సరంలో పద్మ శ్రీ పురస్కారం దక్కింది. తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పని చేసిన అనుభవమున్న సిరివెన్నెల.. ఈ మధ్యకాలంలో వెంకటేష్ నారప్ప, వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాల్లో పాటలు రాశారు. RRR సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ‘దోస్తీ’ పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి చివ‌ర‌గా నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో రెండు పాట‌లు రాశారు.. అవే ఆయన చివ‌రి పాట‌లు కావ‌డం విషాద‌క‌రం.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.