FbTelugu

ప్రజల అప్రమత్తతే శ్రీరామ రక్ష: మోదీ

జాతిని ఉద్దేశించిన ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తుఫాన్‍లా దూసుకొచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని లాక్‍డౌన్ నుంచి కాపాడాలని, రాష్ట్రాలు కూడా లాక్‍డౌన్‍ను చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కరోనాపై కఠిన పోరాటం చేస్తున్నామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులు అనూహ్యంగా పెరగగడంతో దేశంలో ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిందన్నారు. డిమాండ్‍కు తగ్గ ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దేశ ప్రజలు ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని ఫార్మా కంపెనీలను కోరామని, భారీగా కరోనా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్‍లో భారత్ ముందుందని, ఫ్రాస్ట్ ట్రాక్ పద్ధతిలో వ్యాక్సిన్లకు అనుమతులిచ్చామన్నారు. ఇప్పటి వరకు 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించామన్నారు. ఫ్రంట్‍లైన్ వారియర్స్, వృద్ధులకు వ్యాక్సిన్ అందించామని మోదీ వివరించారు.

మే1వ తేదీ నుంచి  18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. వివిధ నగరాల్లో పనిచేస్తున్న శ్రామికులకు వారున్న చోటే టీకా అందిస్తామన్న భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా వారిలో ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మర్యాద పురుషుడు శ్రీరాముడు చెప్పినట్లు కరోనా నియమాలు పాటించాలని ప్రధాని మోదీ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.