నార్త్ కరోలినా: అమెరికా దేశంలో కాల్పులు సర్వసాధారణం అయ్యాయి. తరచూ ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు జరుగుతునే ఉంటాయి. తాజాగా నార్త్ కరోలినాలోని విల్మంగ్టన్ లో శనివారం ఒక ఇంట్లో జరిగిన పార్టీలో కాల్పులు జరిగాయి.
మాటామాట పెరగడంతో నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు మృతిచెందగా నలుగురు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో 16 ఏళ్ల బాలిక ఉన్నట్లు విల్మంగ్టన్ పోలీసు వాచ్ కమాండర్ లెప్టినెట్ ఇర్వింగ్ తెలిపారు. అయితే బాలిక పేరును పోలీసులు వెల్లడించలేదు. మిగతా ఇద్దరిలో షమీర్ జోన్స్ (21), జియా వాడే (22) ఉండగా గాయపడిన వారిలో వాలెరి ఒరెలస్ (18), జమిరియన అట్కిన్స్ (18), కిష్వాన్ జేమ్స్ (21), జైకెరియా క్రాఫోర్డు (19) ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.