FbTelugu

బీజేపీ బలం సోషల్ మీడియానే: శివసేన

ముంబై: దేశంలో బీజేపీ సోషల్ మీడియా ను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ మత విద్యేషాలను వ్యాపింప చేస్తున్నదని శివసేన ఆరోపించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక బీజేపీ, ఫేస్ బుక్ బంధంపై రాసిన కథనం రాజకీయ దుమారం లేపిన విషయం తెలిసిందే.

దీనిపై శివసేన పార్టీ సామ్నా పత్రిక ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని గత ఎన్నికల్లో బాగా లబ్ధి పొందిందని, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత మత విద్వేషాన్ని వ్యాప్తి చేసి రాజకీయంగా బలపడిందని ఆరోపించింది. ఫేస్ బుక్ తీరుపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా సరే ద్వేషాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించింది. బీజేపీ వారు అయినంత మాత్రాన కళ్లు మూసుకోవద్దని హితవు పలికింది.

సోషల్ మీడియాను బీజేపీ సమాజ హితం కోసం కాకుండా విభజించేందుకు వాడుకుంటోందని శివసేన మండిపడింది. 2014 లో బీజేపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా సైన్యం బాగా సహకరించిందన్నారు. వీరి సహకారంతోనే మోదీ ప్రధాని అయ్యారని వ్యాఖ్యానించింది. రాజకీయ లబ్ధి కోసం పుకార్లు, మత విద్వేషాలు వ్యాప్తి చేశారని విమర్శించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద సోషల్ మీడియాలో చాలా కాలం వరకు మీమ్స్, జోకులు ప్రచారంలో ఉన్నాయని శివసేన తెలిపింది.

You might also like