FbTelugu

ఏపీలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం

అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు నాలుగు జోన్లుగా విభజిస్తున్నారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రంగా జోన్లను ఏర్పాటు చేయనున్నారు.
జోన్ల వివరాలు…

విజయనగరం జోన్: 1.విశాఖ, 2.శ్రీకాకుళం, 3.విజయనగరం
కాకినాడ జోన్: 1.తూర్పు గోదావరి, 2.పశ్చిమగోదావరి, 3.కృష్ణా
గుంటూరు జోన్: 1.నెల్లూరు, 2.ప్రకాశం, 3.గుంటూరు
కడప జోన్: 1.చిత్తూరు, 2.కర్నూలు, 3.అనంతపురం, 4.కడప
ఒక్కో జోన్ కు ఒక్కో ప్రత్యేకత ఉండనున్నది. రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే నాలుగు జోన్లు వేటికవే ప్రత్యేకంగా నిలబడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా జోన్లలోని ప్రత్యేకత పరిస్థితులు, అక్కడ అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాల దృష్ట్యా వేర్వేరు వ్యూహాలను వైసీపీ ప్రభుత్వం సిద్దం చేస్తున్నది.
విజయనగరం జోన్ పరిధిలోకి వచ్చే కొత్త రాజధాని విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మైనింగ్, గిరిజన సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు.

కాకినాడ జోన్ పరిధిలో ఆక్వా, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యమిస్తూ చర్యలు చేపడతారు. గుంటూరు జోన్ లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోర్టులు, ఎంఎస్ఎంఈ లకు ప్రాధాన్యం ఇస్తారు. కడప జోన్ లో హార్టికల్చర్, చిరుధాన్యాల బోర్డు, ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.
కొత్తగా ఏర్పాటు కానున్న నాలుగు ప్రాంతీయ జోన్ల పర్యవేక్షణ కోసం పాలనా వ్యవస్థను ఖరారు చేశారు. బోర్డు కు చైర్మన్ తోపాటు ఏడుగురు సభ్యులు ఉండేలా కమిటీ ఉండనున్నది. జోన్ల చైర్మన్లకు క్యాబినెట్ హోదా కల్పించనున్నట్లు సమాచారం.

You might also like