FbTelugu

గుట్టుగా నాలుగు పెళ్లిళ్లు… ఫిర్యాదుతో వెలుగులోకి!

భువనేశ్వర్: సర్కార్ టీచర్ గా పనిచేస్తూ నలుగురికి నీతులు చెప్పాల్సిన ఆయనే నీతి తప్పారు. పెద్దలు కుదిర్చిన మొదటి సంబంధాన్ని చేసుకున్న ఆయన ఆ తరువాత గుట్టుగా ముగ్గురిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు భార్యలు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది.

కటక్ జిల్లా గోపినాథ్ పూర్ లోని ప్రభుత్వ నోడల్ హైస్కూలులో ఆర్ట్ టీచర్ గా కృష్ణ చంద్ర నాయక్ పనిచేస్తున్నాడు. 2001లో అతనికి రౌసపట్నాకు చెందిన ఒక మహిళతో వివాహం జరిగింది. మళ్లీ 2009లో మొదటి భార్యకు తెలియకుండా నర్సును రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో మూడేళ్లు కాపురం చేసిన తరువాత, ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు తస్కరించాడు. రెండో భార్య పోలీసులను ఆశ్రయించడంతో వారు ఆయన నుంచి బంగారు ఆభరణాలు, డబ్బులు ఇప్పించారు.

మళ్లీ 2016 లోగోవిందా పూర్ కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు భార్యలకు విడాకులు ఇవ్వకుండానే నాలుగో మహిళను 2018లో వివాహం చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా నలుగురిని చేసుకున్నాడు కాని అదృష్టం కలిసి రాలేదు. మరో ఇద్దరిని చేసుకున్నట్లు మొదటి, రెండో భార్యకు తెలియడంతో వెంటనే కటక్ లోని మహిళా పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించి టీచర్ ను అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.