దక్షిణాదిన పాగా వేయాలనే కమలం ఆశలు ఎప్పటికి తీరుతాయో. సరైన నాయకుడు లేని లోటు పూడ్చేందుకు వలస నేతలను ఆహ్వానించినా ఆశించిన లాభం మాత్రం ఒనగూరటం లేదు.
ఏపీలో కమ్మ వర్సెస్ కాపు వర్గ బేరీజులో చివరకు కన్నా లక్ష్మినారాయణకు పగ్గాలు అప్పగించినా.. కమ్మ, రెడ్డి వర్గం కలసిరావట్లేదు. నిన్నటి వరకూ పార్టీలో గొంతు వినిపించిన చిన్నమ్మ అదేనండీ మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇక ఇల్లాలుగా ఇంటికేనంటూ వెళ్లిపోయారు.
కావూరి సాంబశివరావు ఏ నాడో అదృశ్యమయ్యారు. మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఇలా మీడియా సమావేశాల్లో తళుక్కుమంటారు. ఇప్పుడు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడ కాపు వర్గానికి. అక్కడ మున్నూరు కాపు వర్గానికి ప్రాధాన్యతనిచ్చిన బీజేపీ ఏం ఆశిస్తుందనేది చెప్పటం కూడా కష్టమే. ఇప్పటికే రెడ్లు… కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో తమకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదంటూ ఆవేదన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో వీరంతా కమలం వైపు వస్తారని.. కాషాయ కండువా కప్పుకుంటారనే నిన్నటి వరకూ బీజేపీ లెక్కలు వేసుకుంది. కానీ.. నాగం జనార్దనరెడ్డి, డీకే అరుణ వంటి హస్తం సీనియర్లు పార్టీ మారినా దాని తాలూకూ ఫలితం మాత్రం బీజేపీలో కనిపించట్లేదు. కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలు హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ జనాల్లోకి గట్టిగా తీసుకువెళ్లే నాయకత్వం ఇప్పటి వరకూ కరవైంది. సంఘ్పరివార్ నేపథ్యం ఉన్న బండి సంజయ్ వంటి వారికి పగ్గాలు అప్పగించటం ద్వారా హిందు నినాదం కాషాయపార్టీ జెండా తెలంగాణలో ఎగిరేందుకు ఉపకరిస్తుందనేది ఆ పార్టీ అంచనా.
గత సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, సికింద్రాబాద్ నాలుగు పార్లమెంటరీ నియోజకర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపు వెనుక హిందూ నినాదం బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు బండికి బాధ్యతలు అప్పగించిన పార్టీ దీన్నే జనాల్లోకి తీసుకెళ్లి 2024 నాటికి మరిన్ని సీట్లు సాధించాలనుకుంటుంది. అయితే.. బండి చాలా జూనియర్.. క్రమశిక్షణ గల నేత. సీనియర్లు కిషన్రెడ్డి, బండారు దత్తన్న, డా.కె. లక్ష్మణ్, రామచంద్రరావు, మురళీధర్ రావు, ఇంద్రసేన్ రెడ్డి ఇలా చాంతాడంత జాబితాలో సీనియర్లు సంజయ్కు ఎంత వరకూ సహకరిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇదే సమయంలో దూకుడుగా ఉండే బీజేపీ నేతలు, కార్యకర్తలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ వంటి వారికి సంజయ్ నాయకత్వం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనేది మాత్రం బహిరంగ రహస్యం.