FbTelugu

ఏపీలో ఇసుక తుఫాను

ఏపీలో ఇసుక తుఫాన్‌ రేపుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో అధికశాతం మంది అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని అక్కడి విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ నేతృత్వంలోని జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు వైసీపీ నేతలు ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వుకొని అమ్ముకుంటున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇసుక వ్యాపారంలో కోట్ల రూపాయలు గడించడమే కాకుండా దానిని అడ్డుకున్న ఓ మహిళా అధికారిపై సాక్షాత్తు ఎమ్మెల్యేనే దాడికి దిగారన్న ఆరోపణలు కూడా చేశారు.

ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం లేపింది. ఈ పరిస్థితుల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇసుకపై ఒక నిర్ణయం తీసుకుంటామని, పేదలకు తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకుంటామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ కూడా ఇచ్చారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో పాటు వైసీపీ అఖండ మెజారిటీతో «అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సీఎం జగన్‌ ఇసుకపై ఒక నిర్ణయం తీసుకునేంత వరకు తవ్వకాలు ఆపాలని ఆదేశాలు జారీచేశారు. ఇది చాలాకాలం వరకు జరిగింది.

ఈ పరిస్థితుల్లో ఇసుక లేకపోవడంతో నిర్మాణరంగం ఆగిపోయింది. నిర్మాణరంగంపై ఆధారపడిన పేదలు రోడ్డున పడ్డారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీంతో టీడీపీతో పాటు మిగతా విపక్షాలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఆందోళనలు కూడా నిర్వహించాయి. ఇసుక తవ్వకాలు ఆపడం వల్ల పేదల పరిస్థితి దారుణంగా ఉందన్నాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు మొదలు పెట్టింది. అయితే, ఇప్పుడు ఇసుక వ్యాపారమంతా వైసీపీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉందని, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వుకొని అధిక ధరలకు అమ్ముకుంటున్నారన్న విమర్శలను విపక్షాలు చేస్తున్నాయి.

పేదలకు ఎక్కడా ఇసుక దొరకడం లేదని, ఏపీలో తవ్విన ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో తవ్వుతున్న ఇసుక ఆ జిల్లా వాసులకు దొరకడం లేదని, అదంతా బెంగళూరుకు తరలించి అక్కడ అధిక ధరలకు అమ్ముతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఇసుకపై గతంలో వైసీపీ ఏ ఆరోపణలు చేసిందో.. ఇప్పుడు టీడీపీ కూడా అదే ఆరోపణలు చేస్తోంది.ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను ఎవరైనా అధికారులు అడ్డుకుంటే వైసీపీ ప్రజాప్రతినిధులు వారిని బెదిరిస్తున్నారని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ఏది ఏమైనా టీడీపీ, వైసీపీల మధ్య ఇసుక తుఫాన్‌ రేగుతోందని, ఈ రెండు పార్టీలకు ఇదే అంశం విమర్శనాస్త్రంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

You might also like