FbTelugu

గ్రామ‌ స‌చివాలయాల్లో ‌ఇసుక బుకింగ్‌

– బల్క్‌ ఆర్డర్ల అనుమతులు జేసీకి అప్ప‌గింత‌

– ఇసుకపై స‌మీ‌క్ష‌లో సీఎం జగన్ ఆదేశం

తాడేపల్లి: ‌ఇసుక బుకింగ్ చేసుకునే అవ‌కాశం గ్రామ‌, వార్డు స‌చివాలయాల ద్వారా క‌ల్పించాల‌ని, పెద్ద ఎత్తున ఇసుక కావాల్సిన వారికి అనుమతులు ఇచ్చే బాధ్యతలు జేసీకి అప్ప‌గించాల‌ని సీఎం వైఎస్. జగన్ రెడ్డి ఆదేశించారు.

తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన సమీక్షలో సీఎం జగన్ రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా వైరస్‌ కారణంగా రీచ్‌లన్నీ మూతబడ్డాయని అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే రీచ్‌లు ప్రారంభమవుతున్నాయని, పదిరోజుల్లో రోజుకు 3 లక్షల టన్నులు ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న‌ట్లు వారు వివ‌రించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జ‌గ‌న్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

బల్క్‌ ఆర్డర్‌కు ఇప్పటికైనా సరైన నిర్వచనం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బల్క్‌ ఆర్డర్లను వెబ్ సైట్ నుంచి  తొలగించాలన్నారు. బల్క్‌ ఆర్డర్లకు అనుమతులను జేసీకి అప్పగించాలని ఆదేశించారు. పోర్టల్‌ ఆన్‌ చేయగానే.. నిల్వలు అయిపోతున్నాయన్న భావన పోగొట్టాలి. డిపోల్లో ఇసుకను భారీ ఎత్తున అందుబాటులో పెట్టాలని సీఎం సూచించారు.

గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ను చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలి, నియోజకవర్గం మొత్తానికి ఒకటే రేటు ఉండేలా చూడాలన్నారు. చిన్న చిన్న నదులనుంచి పక్కనే ఆనుకుని గ్రామాలకు ఎడ్లబళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలని జగన్ రెడ్డి సూచించారు.

You might also like