దేశవ్యాప్తంగా కరోనా ఊహించిన షాక్ ఇచ్చింది. సాధారణ ప్రజాజీవనంపై పెను ప్రభావం చూపుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయా! అసలు మనుగడ కొనసాగేందుకు ఏం చేయాలనే బెంగ చిన్న, పెద్ద అందరినీ పట్టిపీడిస్తుంది.
ఇటువంటి సమయంలో రేపటి అవసరాల కోసం జనం పొదుపు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాచిన డబ్బును మరింత జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. రిజర్వ్భ్యాంకు గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజల వద్ద రూ.25లక్షల కోట్ల రూపాయల నగదు నిల్వలున్నాయి. మరో రెండు మూడు నెలల వరకూ ఎటువంటి ఇబ్బంది ఎదురైనా రోజువారీ ఖర్చుల కోసమే వీటిని దాచుకున్నారు. పేద, ధనిక వర్గాలు కూడా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖర్చుచేసేందుకు వెనుకాడుతున్నారనేది బహిరంగరహస్యం.
దేశవ్యాప్తంగా మాల్స్, హోటల్స్ పెరిగినా కేవలం 15శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుందట. ఇదే సమయంలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు ఈపీఎప్ సొమ్ము విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది చిరుద్యోగులు వినియోగించుకున్నారని ఈపీఎఫ్ అధికారులు వెల్లడించారు. కార్మికశాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్, మే నెలల్లో సుమారు 37 లక్షల మంది తమ సొమ్ము విత్‌డ్రా చేసుకున్నారు. సుమారు రూ.11,540కోట్లు ఈపీఎఫ్ ఖాతాదారులు విత్‌డ్రా చేసుకున్నారు. 32 లక్షల క్లెయిమ్‌లను ఇప్పటి వరకూ పరిష్కరించినట్టు సంస్థ వెల్లడించింది. వీరిలో రూ.15,000 వేతనం తీసుకునే ఉద్యోగుల నుంచి రూ.50వేల వేతనం పొందే ఉద్యోగుల వరకూ ఉన్నట్టు తెలిపింది.