FbTelugu

రూ.11 కోట్ల లూటీ… క్షమించమని వేడుకున్న విజయ్

హైదరాబాద్: మాయలేడి ప్రేమ మైకంలో మిమ్మల్ని నిండా ముంచేశాను.. ఆమె మత్తులో పడి తేరుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగింది.. క్షమించాలంటూ సంచలన సృష్టించిన రూ.11కోట్ల మోసం కేసులో ఆత్మహత్య చేసుకున్న విజయ్ కుమార్ రెడ్డి చివరి మాటలు ఇవీ.
బాచుపల్లి పోలీసులు ఇటీవల రూ.11.60 కోట్ల మోసానికి పాల్పడిన మాయలేడి శృతి సిన్హా తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కడప జిల్లాకు చెందిన శిరీష హైదరాబాద్ వచ్చిన తరువాత తన పేరును శృతి సిన్హా గా మార్చుకున్నది. విజయ్ కుమార్ రెడ్డి, శృతి సిన్హా మధ్య స్నేహం చిగురించి, లైంగిక సంబంధాల వరకు వెళ్లింది. అప్పటికే తనకు పెళ్లై పిల్లలు ఉన్నా, వారిని తన సోదరి పిల్లలుగా నమ్మించింది. నిజాంపేటలో ప్రణవ్ అంటీలియా విల్లలో విజయ్ తో సహజీవనం చేయడం మొదలు పెట్టింది. విల్లా పక్కనే ఉంటున్న మైనింగ్ వ్యాపారి వీరారెడ్డితో పరిచయం ఏర్పడింది.

విజయ్ ను ఐపీఎస్ అధికారిగా, తను మానవ హక్కుల కమిషన్ దక్షిణ భారత శాఖ ఛైర్ పర్సన్ గా పరిచయం చేసుకున్నది. కడపలో తమకు 72 వోల్వో బస్సులు, 50 ఎకరాల పొలం ఉందని నమ్మబలికించారు. వీరారెడ్డి స్వస్థలం కడప కావడంతో ఒకే కులానికి చెందిన వారు కావడంతో విశ్వాసం పెరిగింది. వీరారెడ్డి మైనింగ్ వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్నాడని గమనించిన ఇద్దరు డబ్బులు కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశారు. వీరారెడ్డి బావమరిదికి రూ.100 కోట్లు ఇచ్చే సంబంధం చూపెడతామని, తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయిస్తామని చెప్పారు. నిజమేనని నమ్మిన వీరారెడ్డి విడతల వారీగా రూ.11.60 కోట్లు చెల్లించాడు. ఆ డబ్బుతో విలాసాలకు అలవాటు పడి విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. విలువైన కార్లు, విల్లాలు కొనుగోలు చేశారు.

వీరు నకిలీలు అయిన వీరారెడ్డి సన్నిహితుల ద్వారా తెలియడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఆయన వారి ఇంటికి వెళ్లి తన డబ్బులు తనకు ముట్టచెప్పాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని భావించిన విజయ్ కుమార్ రెడ్డి, వీరారెడ్డి భార్యకు ఫోన్ చేసి క్షమాపణ కోరాడు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని కన్నీళ్లు పెట్టుకుని చెప్పడంతో వీరారెడ్డి భార్య వారించింది. చనిపోవద్దు తమ్ముడు, చనిపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. మగాడిలా మా డబ్బులు మాకు వచ్చేలా చేయ్, ఆత్మహత్య వద్దని సూచించింది. అయినా విజయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మోసం జరిగిన మొత్తం లో సగం డబ్బు వరకు అందుబాటులో ఉన్నా విజయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనేది ఆరా తీస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.