FbTelugu

అమ్మో బియ్యం!

లాక్‌డౌన్‌ వేళ బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఖరీఫ్‌లో వరి పంటలకు తెల్లదోమ కాటు వల్ల దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతోనే ధరలు పెరిగాయి.

మరోపక్క లాక్‌డౌన్‌ వల్ల మిల్లర్ల నుంచి దుకాణాలకు రావాల్సిన స్టాక్‌ రాకపోవడంతో బియ్యం ధరలు మరింత పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. సన్నబియ్యం బాటలోనే దొడ్డు బియ్యం ధరలు కూడా అమాంతం పెరిగాయి. దీంతో సామాన్యులు సన్నబియ్యం తినలేమని అంటున్నారు. నెలక్రితం క్వింటాలు రూ.3,800 ధర ఉన్న సన్న బియ్యం ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల మార్కెట్‌లో రూ.5,200 ధర పలుకుతుంది. ఒక్కసారిగా రూ.1,400లు బియ్యం ధర పెరగడంతో సామాన్యుడికి సన్నబువ్వ భారంగా మారింది.

పాత సన్నబియ్యం ధర రూ.5,200, పాత దొడ్డు బియ్యం రూ.3,800, కొత్తవి సన్నబియ్యం రూ.4,800 పలుకుతున్నాయి. సన్న బియ్యం కొనడం కాదుకదా కొందామన్న ఆలోచన కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. మిల్లర్లు బియ్యం ఉత్పత్తిని తగ్గించి ధాన్యం నిల్వలు భారీగా పెట్టుకోవడం వల్ల కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. సన్నబియ్యం తినలేమని హంస(దొడ్డు) బియ్యం కొందామంటే వాటి ధరలు కూడా పెరిగిపోయాయి. నెలక్రితం హంస క్వింటాలు రూ.3వేలు ఉండగా, ఒక నెలలోనే రూ.800 పెరిగింది. ప్రస్తుతం క్వింటాలు రూ.3,800లకు బియ్యం లభిస్తున్నాయి.

వందలాది ఎకరాల కొద్ది పొలాల్లో సుడిదోమ పోటుకు వరిపంట నేలకొరిగి దిగుబడులు తగ్గడంతో రైతన్నలకు పెట్టుబడులు కూడా దక్కలేదు. ఫలితంగా వరిపంట ఆశించిన మేరకు పండకపోవడంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. వరి ధాన్యం ధరలు పెరిగినందున వ్యాపారులు బియ్యం ధరలు పెంచేశారు. నిఘా, నియంత్రణ లేకపోవడంతో సామాన్యుడికి బియ్యం కొనడం కష్టంగా మారింది. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షం వల్ల వరికి విపరీతమైన తెగుళ్లు వచ్చి ఎకరానికి 40 బస్తాలు పండే వరిధాన్యం 20 బస్తాలు కూడా రాలేదు. దీనికి తోడు బియ్యం ఎగుమతుల కోసం వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బియ్యం ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.