FbTelugu

‘‘మేఘా’’ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మేఘా కంపెనీ ని తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడు, ఎం.పి ఏ.రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా అంటే? అవుననే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
రాష్ట్ర నూతన సారధిగా ఏఐసిసి నియమించిన తరువాత రేవంత్ రెడ్డి శనివారం రాత్రి మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి కె.జానారెడ్డి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

పశ్చిమ బెంగాల్ తరహా బలోపేతం అవుతామని రాష్ట్ర బిజెపి అంటోందని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి పై విధంగా సమాధానమిచ్చారు. మీడియా మిత్రులు ఈ అంశంలో లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని, సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ తో చర్చించినట్లు అప్పట్లో రాత్రికి రాత్రి ఒక ఫామ్ హౌస్ లో చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఆ రోజు రాత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఛార్టర్డ్ ఫ్లైట్ ఎవరిది అని ప్రశ్నించారు. ఆ ఛార్టర్డు ఫ్లైట్ ఏర్పాటు చేసింది సిఎం కెసిఆర్ అవునా కాదా అని ఆయన లేవనెత్తారు. ఈటల రాజేందర్ ను బిజెపిలోకి నెట్టడానికి బిజెపి సహాయాన్ని కెసిఆర్ తీసుకున్నారు. ఆ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఛార్టర్డ్ ఫ్లైట్ ఎవరిది, ఏ కంపెనీది అని అన్నారు. ఆయన ఫ్లైట్ ఓనర్ కు రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కెసిఆర్ ప్రభుత్వం కట్టబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఆ ఫ్లైట్ ఏర్పాటు చేసింది ఎవరు, కిషన్ రెడ్డి దగ్గరకు ఈటలను దగ్గర చేసింది ఎవరు అనేది లోతుగా విచారించాలని జర్నలిస్టులను కోరారు. ఆ ఫ్లైట్ ఇచ్చిన యజమాని అయిన మేఘా ఇంజనీరింగ్ కు, సిఎం కెసిఆర్ ఉన్న సంబంధాలు బయటకు తీయాలని కోరారు. ఆ ఫ్లైట్ యజమాని మేఘా ఇంజనీరింగ్ కు, కిషన్ రెడ్డికి సంబంధాలు లేవన్నారు.

ఇవి బయటకు తీస్తే తెలంగాణలో ఏం జరుగుతుందనేది అన్నీ బయటపడతాయన్నారు. ఈ ఆరోపణలను కిషన్ రెడ్డి ఖండిస్తున్నారు కదా మీడియా ప్రశ్నించగా, ఆ రోజు కిషన్ రెడ్డి వచ్చిన ఫ్లైట్ ఎవరిదో కనుక్కోవాలన్నారు. ఆ ఫ్లైట్ యజమానికి, కెసిఆర్ కు మధ్యనున్న ఫెవికాల్ బంధం తెలుసుకుని చెబితే అప్పుడు స్పందిస్తానని రేవంత్ బదులిచ్చారు. కెసిఆర్ కు దెబ్బ తగలకుండా దడీ కట్టినవాళ్లు బిజెపి వాళ్లని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు దక్కించుకుని దోపిడికి పాల్పడుతూ కాంగ్రెస్ పాలిట శాపంగా పరిణమించిందని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) గతంలో ఆరోపించారు. మారుతీ కారులో తిరిగే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ యజమాని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని విమర్శించారు. తెలంగాణ నుంచి మేఘా ను తరిమిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్తు లేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్. బిజెపి లకు ఆ కంపెనీ నిధులు సమకూర్చుతోందని జయప్రకాశ్ రెడ్డి ఆరోపించంతో చర్చనీయాంశంగా మారింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.