FbTelugu

సాగర్‌ ప్రచారానికి రేవంత్‌ దూరం

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 17న ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ ఎలాగైనా గెలిచి పార్టీకి జీవం పోయాలని కాంగ్రెస్‌ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అందుకోసం అక్కడ జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని అందరికంటే ముందుగానే ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. పైగా ఇక్కడ ప్రచార బాధ్యతలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేడ్చల్‌ ఎంపీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలాంటి ప్రజాదరణ కలిగిన నేతలకు అప్పగించారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డి ఉపన్యాసంతో ప్రజలను ఆకట్టుకునే సత్తా నాయకుడు. ఆయన ఉపన్యాసం వినేందుకు జనం కూడా ఆసక్తి కనబరుస్తారు. ఆయన మాట్లాడే విధానం, ప్రత్యర్థులపై చేసే విమర్శలు.. చలోక్తులు ప్రజల్లోకి బాగా వెళతాయి. న్యూట్రల్‌ ఓటర్లను ప్రభావితం చేయగల ఉపన్యాసంగా రేవంత్‌రెడ్డి మాటలను చెబుతుంటారు. పైగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై ఆయన చేస్తున్న పోరాటానికి చాలామంది ఫిదా అవుతుంటారు. ఎన్నికల్లో ఎత్తులు.. పై ఎత్తులు వేయడంలో రేవంత్‌రెడ్డికి అందెవేసిన చెయ్యి. ఆయన ప్రచారం చేస్తే నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి కూడా బాగా కలిసివస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పైగా కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా ఒక్కతాటి మీదకకు వస్తున్నారు కాబట్టి ఆ పార్టీ శ్రేణులు కూడా సంతోషంగా.. రెట్టించిన ఉత్తేజంతో ఎన్నికల్లో విజయం కోసం ఎక్కువగా పనిచేసే వీలుంది. కానీ, ఈ ఎన్నికల ప్రచారంలో జానారెడ్డి తరఫున రేవంత్‌రెడ్డి ప్రచారానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలు నిజంగా కాంగ్రెస్‌ శ్రేణులకు, ముఖ్యంగా జానారెడ్డికి షాక్‌ కలిగించే అంశమే. ఇంతకీ రేవంత్‌రెడ్డి ఈ ప్రచారం ఎందుకు రావడం లేదో తెలుసా..? జానారెడ్డి మీద వ్యతిరేకతతో కాదండోయ్‌. మరి ఇంకెందుకు అనుకుంటున్నారా.. అదేనండి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఉందికదా.. అది ఇప్పుడు రేవంత్‌రెడ్డికి కూడా సోకింది. వచ్చేనెల 17న సాగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంటే ప్రచారం ఏప్రిల్‌ 15న ప్రచారానికి తెరపడుతుంది.

ఈ తరుణంలో రేవంత్‌రెడ్డి మంగళవారం కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. కనీసం ఆయన హోం ఐసోలేషన్‌లో 14 రోజులు ఉండాల్సి ఉంది. ఆ తర్వాత మళ్లీ కరోనా పరీక్ష చేయించుకోవాలి. అప్పుడు నెగెటివ్‌ రిపోర్టు వస్తేనే బయటకు వచ్చే అవకాశముంది. సో, 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌ అంటే వచ్చేనెల ఐదో తేదీ వరకు ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. అంటే అప్పటివరకు ఆయన సాగర్‌లో జరిగే ప్రచారానికి దూరం కావాల్సిందే. 14రోజుల తర్వాత నెగెటివ్‌ వస్తే మాత్రం కేవలం ఆయన ప్రచారానికి పది రోజులు మాత్రం ప్రచారం చేసే అవకాశముంది. సో, సాగర్‌ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి పాల్గొనే రోజులు చాలా తక్కువగానే ఉంటాయి. అది నిజంగా కాంగ్రెస్‌ పార్టీకి, జానారెడ్డికి మైనస్‌ పాయింటే.

You might also like

Leave A Reply

Your email address will not be published.