FbTelugu

సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్..? ముస్లిం పర్సనల్ లా బోర్డు

Review-Petition-on-Supreme-Court-says-Muslim-Law-Board

ఢిల్లీ: అయోధ్య వివాదాస్పద స్థలం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు పలు వ్యాఖ్యలు చేసింది.పర్సనల్ లా బోర్డు తరఫున జాఫర్ యాబ్ గిలాని స్పందించారు. తీర్పు తమను నిరాశకు గురి చేసిందని, అయినప్పటికీ గౌరవిస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విధంగా తమకు ఐదెకరాల స్థలం అక్కర్లేదని, న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామన్నారు. భారత పురావాస్తు శాఖ (ఏఎస్ఐ) రిపోర్టులో ముస్లిములకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదని బోర్డు ఆరోపించింది. కాగా జడ్జి మెంట్ కాపీ పూర్తిగా చదివాక రివ్యూ పిటిషన్ వేయాలో లేదో నిర్ణయిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ఓ పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ మాట్లాడుతూ, సుప్రీం తీర్పు తనకు ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు.

తీర్పు సంతృప్తికరంగా లేదు…

సుప్రీంకోర్టు ఏకపక్ష తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది షేక్ అహ్మద్ సయ్యద్ మాట్లాడుతూ తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు. అయినప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. తీర్పు కాపీని మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని.. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామని సయ్యద్ తెలిపారు. తీర్పును అందరూ గౌరవించాలని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు.

You might also like