FbTelugu

రివర్స్ గవర్నమెంట్: రాం మాధవ్

విజయవాడ: ఏపీలో పోలవరం టెండర్లు మొదలు అన్నీ రివర్స్ లో నడుస్తున్నాయని, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాం మాధవ్ ఆరోపించారు.

అమరావతిలో రివర్స్ పాలన మొదలైందని ఆయన అన్నారు. మద్యపాన నిషేదం అని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకువచ్చి రివర్స్ అడుగులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒంటెద్దు పోకడలతో పాలన చేస్తూ, 60 సార్లు హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు. వారానికో సారి కోర్టు నుంచి తీర్పులు వస్తున్న ప్రభుత్వం ఇదేనేమో అన్నారు. తిరుమల భూముల విషయంలో కూడా రివర్స్ గేర్ తీసుకున్నారని రాం మాధవ్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలనపై ఆల్ ఇండియా వర్చువల్ ర్యాలీ నిర్వహించారు. ఇవాళ కోస్తాంధ్ర బీజేపీ నేతలతో వీడియో ద్వారా రాం మాధవ్ ప్రసంగించారు. కరోనా కారణంగా ప్రజల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లలేకపోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి పాల్గొన్నారు.

You might also like