FbTelugu

తెలంగాణలో గాలికొదిలేశారు: రేవంత్

హైదరాబాద్: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ అగర్వాల్ కు మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోగులను గాలికి వదిలేశారని, ఎక్కడా పారదర్శకత లేదని, ఇప్పటి వరకు 70వేల కరోనా టెస్టులు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందును వెంటనే వైద్య, ఆరోగ్య శాఖను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పరిస్థితిపై వ్యక్తిగతంగా కలిసి వినతి పత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు వచ్చిన కేంద్ర బృందం అప్పాయింట్ మెంట్ అడగ్గా ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ ఒత్తిడి తోనే తమకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేంద్ర బృందానికి సారాధ్యం వహిస్తున్న లవ అగర్వాల్ కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.

లవ  అగర్వాల్,
సంయుక్త కార్యదర్శి, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిని మీకు సమర్పించాలని అనుకుంటున్నాను. జూన్ 23 నాటికి కోవిడ్ 19 పాజిటివిటీ రేటు 32.1%, ఇది దేశంలోని ప్రధాన నగరాల్లో అత్యధికం. 10 లక్షల జనాభాకు పరీక్షలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం 70,000 పరీక్షలు మాత్రమే జరిగాయి. వైరస్ పెరుగుదలను అర్థం చేసుకోవడానికి, దానిని నియంత్రించడానికి వైద్య పరీక్షలు చాలా అవసరం.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరీక్షలలో పారదర్శకత లేదు, మొత్తం రాష్ట్రం అనిశ్చితిలో ఉంది. పరీక్షల రేటును మెరుగుపరచమని రాష్ట్ర ప్రభుత్వానికి ఐసీఎంఆర్ పదేపదే చెప్పింది, కానీ ఎప్పుడూ సరిదిద్దలేదు.
ట్రూనాట్ యంత్రాల కొరత ఉంది, పొరుగు రాష్ట్రం ఏపీలో 44 ఉండగా తెలంగాణలో కేవలం 22 మాత్రమే ఉన్నాయి, పరీక్షల కోసం ఒక కేంద్ర ప్రయోగశాల మాత్రమే ఉంది. ఈ జనాభాకు ఇది సరిపోదు. 22 ప్రైవేటు ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవు, ఆసుపత్రిని నడపడానికి అవసరమైన పరికరాలు లేదా వైద్య సిబ్బంది లేనందున టిమ్స్ నామమాత్రంగా ఉంది.
నేను ఆ స్థలాన్ని స్వయంగా సందర్శించాను. కార్పొరేట్ సంస్థ విరాళంగా ఇచ్చిన కొన్ని పడకలు తప్ప మరేమీ అక్కడ లేవు. మురుగునీటి శుద్ధి కేంద్రం కూడా అందుబాటులో లేదు. భయంకరమైన దుస్థితిని చూసి, నా పార్లమెంట్ నిధుల నుండి నిధులు ఇచ్చినా కూడా ఇంతవరకు ఇప్పటివరకు ఉపయోగించలేదు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి మాత్రమే ప్రభుత్వ అనుమతి పొందిన చికిత్సా కేంద్రంగా గుర్తించబడింది, ఇక్కడ సరైన మందులు, పారిశుధ్యం, పరిశుభ్రత, కోవిడ్-19 పాజిటివ్ రోగులకు చికిత్స చేయడంలో జాగ్రత్తలు లేవు. ఆసుపత్రిని నడపడానికి 1200 మంది సిబ్బంది అవసరం, కాని వాస్తవంగా 400 మాత్రమే సిబ్బంది అన్నారు. ఇది అక్కడ పనిచేసే ప్రతి సిబ్బందిపై తీవ్రమైన భారం మోపుతుంది.
వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, వైరస్‌తో పోరాడటానికి అవసరమైన పరికరాలు లేనందుకు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ వైద్యులు, సిబ్బంది ప్రతి రోజూ వారి జీవితాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని కితాబునిచ్చారు.
ఇటీవల, టీవీ5 రిపోర్టర్ మనోజ్ యాదవ్ చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అతను చికిత్స సమయంలో కనీసం నీరు కూడా ఇవ్వలేదని ఫిర్యాదు చేసిన గంటల్లోనే కన్నుమూశాడు. తెలంగాణ జర్నలిస్టులు దీనికి వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం, ఫ్రంట్‌లైన్ యోధులకు రూ.50 లక్షల బీమా ఉంది. జర్నలిస్టులు తమ వృత్తిని ప్రతి రోజూ రిస్క్‌లో పెట్టి పనిచేస్తున్నందున వీరిని కూడా బీమా పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి.
వాస్తవానికి ఈ రోజు కూడా, నా పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలో దారుణమైన పరిస్థితి అలాంటిది.
ఈ భయంకరమైన పరిస్థితులలో, మహమ్మారి సంభవించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అంటువ్యాధిని అరికట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది జరగకపోతే, తెలంగాణ, ముఖ్యంగా కోవిడ్ కేసులు, మరణాల పెరుగుదల తీవ్రంగా ఉంటుంది..

గౌరవంతో,
అనుముల రేవంత్ రెడ్డి, ఎం.పీ
మల్కాజ్‌గిరి పార్లమెంట్, తెలంగాణ రాష్ట్రం.

You might also like