FbTelugu

కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని తన లేఖలో కోరారు.

గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన విలేకరి మనోజ్ కుమార్ యాదవ్ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియాల చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టు సమాజంలో మీరు మానవత్వం లేని మనిషిగా మిగిలిపోతారని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ క్రింది విధంగా ఉంది.

 

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారు,

విషయం : కరోనా సమయంలో జర్నలిస్టుల భద్రత, సహకారం గురించి…

ఒక్క అక్షరం లక్ష మెదళ్లను కదిలిస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు సమాజంలో విలేకరుల పాత్ర ఏమిటి అన్నది చెప్పడానికి. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అనిర్వచనీయం. అత్తెసరు జీతాలు, అర్ధాకలి జీవితాలతో అనుక్షణం ప్రజలకు సమాచారం చేరవేయడమే శ్వాసగా, ధ్యాసగా మీడియా ప్రతినిధులు పని చేస్తున్నారు.

కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి, సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారు. కష్టకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాజా పరిస్థితుల పై క్షణక్షణం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మీడియా ప్రతినిధులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. యువ విలేకరి మనోజ్ కుమార్ యదవ్ కరోనా సోకి మరణించిన సందర్బం హృదయాన్ని కలచివేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల భద్రత విషయంలో తక్షణం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టు మిత్రుడికి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలి. ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఈ సంక్షోభ సమయంలో నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేయాలి. ఇటీవల మృతి చెందిన మనోజ్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలి. వీటి పై తక్షణం స్పందించాల్సిందిగా సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాను. లేనిపక్షంలో జర్నలిస్టు సమాజంలో మీరు మానవత్వం లేని మనిషిగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నాను.

 

ఎ. రేవంత్ రెడ్డి,

ఎంపీ, మల్కాజ్ గిరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.