FbTelugu

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ను విచారించాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి బయట పడుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఈ రోజు కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోయే కాలువకే పెద్ద గండి పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదు రెండు ప్రధాన కాలువలు గండ్లు పడ్డాయన్నారు. కేసీఆర్ నియోజక వర్గంలోనే , ఫామ్ హౌస్ కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత ఘోరంగా ఉంటే ఇక రాష్ట్రంలో జరిగిన కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

చిన్న కాలువల పరిస్థితి ఇలా ఉంటే ఇక సర్ఫేస్ లో నిర్మించిన 50 టీఎంసీల మల్లన్న సాగర్, 15 టీఎంసీ ల కొండపోచమ్మ సాగర్, గందమల్ల రిజర్వాయర్ల పరిస్థితి ఎలా ఉండబోతోందో ఆలోచిస్తే భయం వేస్తోందన్నారు. ఆ జలాశయాలకు ఇలాగే గండిపడితే ఒక్క ఊరు మిగలదు. వాటి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు జలవిలయంలో కొట్టుకుపోతాయని రేవంత్ అన్నారు.
కేసీఆర్, మేఘా కంపెనీ కమీషన్ల కక్కుర్తికి ఈ నాణ్యత లోపలే పరాకాష్ట అన్నారు. రూ. 1లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ చేత ఈ పనులపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

You might also like