FbTelugu

జర్నలిస్టుల కష్టాలపై స్పందించండి…

గవర్నర్ కు టీయూడబ్ల్యూజే వినతి

హైదరాబాద్: రాష్ట్రంలో జర్నలిస్టులు అనుభవిస్తున్న కష్టాలపై కనీసం మీరైనా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది.

గురువారం నాడు ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసింది. ముఖ్యంగా కరోనా ప్రమాదం నుండి జర్నలిస్టులను రక్షించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 22 మంది జర్నలిస్టులు కరోనా కాటుకు గురయ్యారని, ఇందులో మనోజ్ యాదవ్ ఇటీవలే ప్రాణం కోల్పోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరుతున్న జర్నలిస్టులకు సరైన చికిత్స అందడం లేదన్నారు. కరోనాతో మృతి చెందిన మనోజ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. కరోనా పాజిటీవ్ వచ్చిన జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి కేటాయించాలన్నారు.

మనోజ్ మృతి బాధాకరం..

టీవీ 5 విలేకరి మనోజ్ కుమార్ కరోనాతో మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ విచారం వ్యక్తం చేశారు. కరోనా కాటుకు గురయ్యే జర్నలిస్టులకు చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని ఆమె పేర్కొంటూ ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తానని హామీ ఇచ్చారు.

గాంధీ వద్దు, వేరే చోట చికిత్స చేయాలి...

కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ టీయూడబ్ల్యుజె ప్రతినిధి బృందం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరింది. గురువారం నాడు బిఆర్కే భవన్ లో ప్రతినిధి బృందం మంత్రి ఈటలను కలిసి జర్నలిస్టుల కరోనా కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. జర్నలిస్టులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు.

minister eatala

You might also like