FbTelugu

రిపోర్టర్ ఇంటిని కూల్చేయడం దారుణం: టీయూడబ్ల్యూజే

నారాయణఖేడ్ ఎమ్యెల్యే దౌర్జన్యం పై ఖండన

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలపై వార్త ప్రసారం చేసిన రిపోర్టర్ ఇంటిని కూల్చివేయడం అత్యంత దారుణమని టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది.

ఎమ్యెల్యే కూల్చి వేయించిన కట్టడాన్ని వెంటనే తిరిగి నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో సరైన రీతిలో గుణపాఠం చెబుతామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ హెచ్చరించారు.

సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వెయ్యి మందితో అట్టహాసంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలను వీ6 టీవీ ఛానల్ రిపోర్టర్ పరమేశ్వర్ కవర్ చేశారు. తన జన్మదిన వేడుకలను ప్రసారం చేసి, పరువు తీస్తావా అంటూ అతనిపై కక్ష గట్టి దౌర్జన్యంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చేయడం సహించరానిదన్నారు. ఈ దౌర్జన్యాన్ని టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేయాలని ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిస్తుండగా, మరోవైపు ఇలాంటి ఆర్భాటాలతో ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు భగ్నం చేయడం విచారకరం అన్నారు.

You might also like