FbTelugu

వారికి ఊరట!

కరోనా కాలంలో వలస కూలీల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రాంతం కాని ప్రాంతానికి ఉపాధి కోసం వచ్చి లాక్‌డౌన్‌లో చిక్కుకొని అనేక ఇబ్బందులు పడుతున్నారు.

తినడానికి తిండిలేక.. ఉండడానికి వసతి లేక కాలినడకన వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో కొందరు అస్వస్థతకు గురవుతుంటే.. మరికొందరు ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. అయితే, సర్కారు వీరి కష్టాలను గమనించి వారు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్రం శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది. దీంతో కొందరు వలస కూలీలు ఇళ్లకు చేరుకున్నారు.

అయితే, ఇప్పుడు వారికి మరో చిక్కు వచ్చిపడింది. వారు వారి రాష్ట్రాలకు చేరుకుంటున్నా అక్కడి నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య చివరకు కేంద్రం దృష్టికి రావడంతో వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చేలా రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. అయితే, తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో వలస కూలీలకు ప్రయాణ కష్టాలు చాలావరకు తీరినట్టేనని అంతా భావిస్తున్నారు

You might also like