FbTelugu

కాపు రిజర్వేషన్ రెడ్డి సీఎం లు తొలగించారు: ప‌వ‌న్‌

మంగ‌ళ‌గిరి: ఉమ్మడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ జాబితా నుంచి కాపులను నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి తొలగించారని జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

కాపు రిజర్వేషన్.. రాజకీయ స్వార్థపరుల గుప్పెట్లో నలిగిపోతున్న కోట్లాది మంది కోరిక అని ఆయన అన్నారు. ఈ కోరికను ఓట్ల సాధనకు వేదికగా, ఎండమావిగా అవకాశవాద రాజకీయ శక్తులు మార్చేశాయన్నారు. బ్రిటిష్ వారి పరిపాలనలోనే వెనుకబడిన కులాలుగా (బీసీ) ఉన్న కాపులను 1956లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి బీసీ రిజర్వేషన్ జాబితా నుంచి తొలగించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ తరువాత ఎస్సీ కులం నుంచి వచ్చి సర్వజనుల కష్టసుఖాలు తెలిసిన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టి 1961లో కాపులకు తిరిగి రిజర్వేషన్లను ప్రదానం చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానంద రెడ్డి కాపుల రిజర్వేషన్లను మరోసారి తొలగించివేశారని ఆయన ఆరోపించారు.

ఇక అప్పటి నుంచి అంటే గత 56 ఏళ్లుగా కాపుల పట్ల కపట ప్రేమను నటిస్తూ ఓట్లు దండుకుని అధికారంలోకి రావడం అలవాటుగా మారిపోయిందన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు అందుకుంటున్న వర్గాలవారి ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా అమలు చేయడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

తమను వెనుకబడిన జాబితాలో చేర్చమని కాపులు అడిగినప్పుడల్లా ముందుంచి సై.. అంటూ వెనక నుంచి నై.. అంటున్నారు. ఇతర వర్గాలను రెచ్చగొడుతూ కాపుల నోట్లో మట్టి గొడుతున్నారని ఆయన తూర్పారపట్టారు. కాపులు ఆర్ధికంగా బలపడడం ఇష్టం లేని కొన్ని వర్గాల వారు కాపులకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడుతున్నారన్నారు.

కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న అరకొర ప్రయత్నాలపై కాపు పెద్దలు ఎవరూ సంతృప్తిగా లేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని కబుర్లు చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు కూడా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టి సంకల్పం ఉండి వుంటే మహారాష్ట్ర చేసిన విధంగా చేసేవారని పవన్ గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో కాపులకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి ఈబీసీ కోటా లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిందన్నారు.

ఆ తరువాత జగన్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. వచ్చిందే తడవుగా కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లను తుంగలో తొక్కారని పవన్ ఆరోపించారు. ఇటువంటి కేటాయింపులు కోర్టులలో నిలబడవు అని చల్లగా సెలవిచ్చారన్నారు. 2014 ఎన్నికల సమయం నుంచి పాదయాత్ర వరకు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని జపం చేసిన జగన్ రెడ్డి, యాత్ర మధ్యలో తమ ఎన్నికల వ్యూహాకర్తల బోధనతో కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదిలేదని ప్రకటించేశారు.

కాపులపై ప్రేమతో 13 నెలల్లో రూ.4770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్న జగన్ రెడ్డి కాపులు కోరుతున్న రిజర్వేషన్లను ఎందుకు పునరుద్ధరించడం లేదు? ఆయన అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.