FbTelugu

అక్కడ మళ్లీ రక్తచరిత్రేనా..?

రాయలసీమ ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం. రతనాలు రాశులుగా పోసి అమ్మిన నేల. కవులు.. కళాకారులకు పెట్టింది పేరు. అలాంటి ప్రాంతం ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అడ్డాగా మారింది. బాంబుల మోతలు.. కత్తులతో నరుక్కోవడాలు నిత్యకృత్యంగా మారాయి. సాగునీరు పారాల్సిన భూముల్లో నెత్తురుటేరులు పారాయి. పచ్చని పంట పొలాలతో కళకళలాడాల్సిన పల్లెలు మరుభూములుగా మారాయి. ఇంట్లోనుంచి బయటకెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రావడం కష్టమే అయింది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో రాయలసీమ అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే ఆ దారుణ ఘటనలు తగ్గుతున్నాయి. రాయలసీమలో ఫ్యాక్షన్‌ పల్లెలు ఊపిరిపీల్చుకుంటున్నాయి.

ఇక రాయలసీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు పోయినట్టేనని అంతా సంతోషించారు. కానీ, ఆ సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదన్న బాధ ఇప్పుడు రాయలసీమ వాసుల్లో కనిపిస్తోంది. ఇటీవల రాయలసీమలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మళ్లీ ఫ్యాక్షన్‌ ఊపిరిపోసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ పండితులు కూడా అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఇటీవల మాజీమంత్రి, టీడీపీ నేత జేసీ బ్రదర్స్‌ ఇంటిపై ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేయడం ఏపీలోనే హాట్‌ టాపిక్‌గా మారింది. కత్తులు తీసుకొని టాటా సుమోల్లో జేసీ దివాకర్‌ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటిపైకి వెళ్లి దాడికి దిగడం అప్పటి ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తెరతీసినట్టయింది రాయలసీమ వాసులు భావించారు. ఈ ఘటన జరిగిన వెంటనే అనేక ఘటనలు జరుగుతుండడం అక్కడి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కడప జిల్లాలోనూ టీడీపీ నేత సుబ్బయ్యను దారుణంగా చంపారు. ఆ విషయం మరిచిపోకముందే తాజాగా కర్నూలులోనూ ఓ వ్యక్తి హత్యకు ప్లాన్‌ వేశారు. అయితే, అది త్రుటిలో తప్పింది. తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామానికి చెందిన రాంభూపాల్‌రెడ్డి, అమర్‌నాథ్‌ల మధ్య పాత తగాదాలున్నాయి. వారి తండ్రుల కాలం నుంచి వారిద్దరి మధ్య ఫ్యాక్షన్‌ తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాంభూపాల్‌ స్వగ్రామం వదిలి హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ ఉంటున్నాడు. గురువారం టీ తాగేందుకు బయటకు వచ్చిన రాంభూపాల్‌పై ప్రత్యర్థులు ఇనుపరాడ్, గన్‌తో దాడికి దిగారు.

అయితే, ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదేవిధంగా కడప జిల్లాలోనూ దాడులు ప్రారంభమయ్యాయి. వైసీపీలోని వర్గపోరు పరస్పర దాడులు, ఆపై కాల్పులకు దారి తీసింది. వీరపనాయునిపల్లి మండలం పాయసంపల్లిలో కొత్త సంవత్సర వేడుకల్లో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ నేత నిమ్మకాయల సుధాకర్‌రెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. మహేందర్‌రెడ్డి, అతని అనుచరులు సుధాకర్‌రెడ్డిపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. దీంతో సుధాకర్‌రెడ్డి ప్రత్యర్థులపై కాల్పులు జరిపాడు. ఈ ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం పాయసంపల్లిలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతుండడంతో మళ్లీ రాయలసీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు ప్రారంభం అవుతాయేమోనని రాయలసీమ వాసులు భయపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.