FbTelugu

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రమణ

న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణను నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ కు ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే లేఖ రాశారు. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్.వి.రమణ నియామకం కానున్నారు.
సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్.వి.రమణ పేరు ప్రతిపాదించారు. బోబ్డే ప్రతిపాదనను హోం శాఖకు పంపితే, పరిశీలన జరిపి రాష్ట్రపతి కార్యాలయానికి సిఫారసు చేస్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదంతో ఎంపిక ప్రక్రియ పూర్తి కానున్నది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈ ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. రమణ నియమితులు అయితే 16 నెలల పాటు పదవిలో (2022, ఆగస్టు 22వ తేదీ వరకు) కొనసాగనున్నారు. జస్టిస్ రమణ 1957 ఆగస్టు 27 తేదీన కృష్ణా జిల్లా పొన్నవరం లో జన్మించారు. 1983 లో ఉమ్మడి ఏపీ హైకోర్టు లో న్యాయవాది గా ప్రాక్టీసు చేసేందుకు తన పేరును బార్ అసోసియేషన్ లో నమోదు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున ప్రభుత్వ ప్లీడర్ గా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ గా, క్యాట్ లో రైల్వే శాఖ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. ఏపీ ప్రభుత్వం అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా కొనసాగారు.

2000, జూన్ 27న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మార్చి 10, 2013 నుంచి మే 20, 2013 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. సెప్టెంబర్ 2, 2013న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జిస్టిస్ గా నియమితులయ్యారు. 2014 ఫిబ్రవరిలో పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.