FbTelugu

రాజయ్య.. ఇదేం తీరయ్యా?

Rajaiah--What-is-this

తాటికొండ రాజయ్య.. ఒకప్పుడు పేరుమోసిన పిల్లల డాక్టర్. అనంతరం కాంగ్రెస్ లో చేరి నాటి టీడీపీ దిగ్గజం కడియం శ్రీహరిని ఓడించి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత. తెలంగణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ కు, ఇష్టమైన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. కారు గుర్తుపై పోటీ చేసి ఘన విజయం సాధించి ఉద్యమ చరిత్రలో తనకూ కొంత స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. కేసీఆర్ నుంచి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం పదవిని బహుమతిగా అందుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆరు నెలలు నిండక ముందే ఉప ముఖ్యమంత్రిని చేసిన కేసీఆరే పదవి నుంచి తప్పించారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కడం అనుమానమే అన్న ప్రచారం సాగింది. ఎట్టకేలకు కేసీఆర్ కరుణించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ సమయంలోనే ఓ మహిళతో ‘అత్యంత’ చనువుగా మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చి రాజయ్యను ఇరుకున పెట్టింది. అది తన ప్రత్యర్థుల తప్పుడు ప్రచారం అని ఆయన కొట్టి పడేశారు. ఇన్ని వివాదాలు చుట్టి ముట్టినా.. 2018 ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించారు.

ఇటీవల మరో వివాదం..

తాజాగా పదో తరగతి విద్యార్థిని రాజయ్యకు అన్నం తినిపించునే వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చేతులకు ఏమైనా గాయం అయిందేమో అనుకుంటే అదే వీడియోలో వాటర్ బాటిల్ పైకెత్తి నీళ్ళు తాగుతూ చక్కగా కనిపించారు రాజయ్య. దీంతో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు విద్యార్థిని అన్నం తినిపిస్తానని కోరిందని ఆయన సన్నిహితులు చెబుతున్నా.. ఇది సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజయ్య తీరు మార్చుకోవాలని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటనను రాజయ్య ఏ విధంగా సమర్దించుకుంటారో చూడాలి.

You might also like