FbTelugu

క్వారంటైన్ 7 రోజులే: మంత్రి ఈటల

హైదరాబాద్: క్వారంటైన్ పై కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

కేంద్రం విడుదల చేసిన నూతన మార్గదర్శకాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈటల రాజేందర్ టెలిఫోన్ లో సమీక్షించారు. రాష్ట్రం లోకి అడుగుపెడుతున్న విదేశీయులు ఇకమీదట కేవలం 7 రోజుల పాటు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ ఉంటే చాలు అని కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసిందన్నారు. మరో ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించిందన్నారు.

విదేశాలనుండి వచ్చే వారిలో గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడేవారు, కుటుంబ సభ్యులు చనిపోయినవారు వస్తే వారిని నేరుగా హోమ్ క్వారంటైన్ కి తరలించవచ్చు అని తెలిపిందన్నారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలో కి విమానాలు, రైళ్లు, రోడ్డు మార్గం ద్వారా వస్తున్న వారికి లక్షణాలు ఉంటేనే వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కి తరలిస్తారు. ఆ లక్షణాలు లేనివారు నేరుగా ఇంటికి వెళ్లవచ్చని, స్వీయ రక్షణ పాటించాలి అని కోరారు. ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకొని వైద్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని మంత్రి ఈటల కోరారు.

You might also like