సీనియర్లను కాదని జూనియర్ కు పదవి
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రానికి డీజీపీగా దినకర్ గుప్తా పనిచేస్తున్నారు. తాజాగా ప్రధాన కార్యదర్శిగా ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ విని మహాజన్ నియమితులయ్యారు.
విని ప్రధాన కార్యదర్శి కావడం వెనక ఆమె భర్త దినకర్ లాబీయింగ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1987 బ్యాచ్ కు చెందిన విని ని ఆరుగురు సీనియర్ ఐఏఎస్ లను కాదని సీఎస్ గా పదోన్నతి కల్పించారు. అయితే ఈ ఆరోపణలపై విని స్పందించారు. డిజీపీ భార్య అయితే మాత్రం సీఎస్ గా నియమిస్తారా? దానికంటూ అర్హత ఉంటుందనే విషయాన్ని మరిచి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ప్రస్తుత సీఎస్ కరణ్ అవతార్ సింగ్ పదవీకాలం వచ్చే ఆగస్టు 31వ తేదీతో ముగియనున్నది. అతనిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో తొలగించాలని ప్రతిపక్షాలతో పాటు మంత్రులు సైతం కొద్ది రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఒత్తిడి ఎక్కువ కావడం, బదనాం అవుతుండడంతో పదవీకాలం ముగియకుండానే సీఎస్ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో విని మహాజన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.