FbTelugu

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: హైకోర్టు

హైదరాబాద్: రెండు వారాల్లో జర్నలిస్టుల సమర్పించిన వినతిపత్రం పై స్పందించి వారి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది.

రెండు వారాల్లోపే ప్రభుత్వానికి జర్నలిస్టులు తమ సమస్యలపై  వినతి పత్రం ఇవ్వాలని హైకోర్టు కోరింది. కోవిడ్-19 పై ప్రజలకు అవగాహన కల్పించడంలో జర్నలిస్టుల సేవలు మరువలేమని హైకోర్టు పేర్కొంది. కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (పిల్) హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.

న్యాయవాది రాపోలు భాస్కర్ పిల్ దాఖలు చేయగా, పిటీషనర్ తరపు సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.25 వేలు చొప్పున ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా అందించాలన్నారు. జర్నలిస్టులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అడ్వకేట్ జనరల్ బీఎస్. ప్రసాద్ తెలిపారు.

అడ్వకేట్ జనరల్ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పిటీషన్ ను ముగించింది. రెండు వారాల్లో సమస్య పరిష్కరించాలని, అదే సమయంలో రెండు వారాల్లోపే జర్నలిస్టులు వినతి పత్రం అందచేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

You might also like