FbTelugu

ప్రైవేటు టీచర్లంటే ఇంత అలుసా?: రేవంత్ రెడ్డి

నాగార్జున సాగర్: దళిత ప్రైవేటు టీచర్ రవి కుమార్ దంపతుల ఆత్మహత్య హృదయాన్ని కలచి వేసిందని కాంగ్రెస్ ఎంపి ఎ.రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో మీ ప్రభుత్వం కనీస మానవత్వంతో వ్యవహరించ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు టీచర్ రవి కుమార్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనాథలైన పసిబిడ్డలు సాక్షి, సందేశ్ మొహాలు చూసైనా మీకు జాలి వేయలేదా ప్రశ్నించారు. మీ ఏడేళ్ల పాలనలో దళితులను కుడి ఎడమల దగా చేశారన్నారు. దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించడంతో మీ మొదటి మోసం మొదలైందన్నారు. టీచర్ రవి కుమార్ దంపతుల బిడ్డల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

నాగార్జున సాగర్ నవోదయ పాఠశాలలో వారికి విద్య చెప్పించాలన్నారు. ప్రయోజకులయ్యే వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఆ బిడ్డల పేరిట సిఎం సహాయ నిధి నుంచి చెరో రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు మీరు ఇస్తానని చెబుతోన్న రూ.2000 ఏ మూలకు చాలదు అన్నారు. ఉపాధి హామీ కూలీ కే రోజుకు రూ.150 వస్తోంది, అంతకన్నా హీనమా ప్రైవేటు టీచర్లు అని ప్రశ్నించారు. ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు, విద్యా వాలంటీర్లు, ప్రైవేటు కళాశాలల లెక్చరర్లకు నెలకు రూ.5000 ఆర్థిక సాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు బహిరంగ లేఖ రాసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.