FbTelugu

ప్రైవేటు హాస్పిటళ్లు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందే!

ముంబయి: కరోనా వైరస్ చికిత్స పేరుతో, పరీక్షల పేరుతో అక్రమంగా వసూలుచేసిన సొమ్ములపై మహారాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఇలా దండుకున్న ప్రైవేటు హాస్పిటళ్లపై అధికారులు కొరడాను ఝులిపిస్తున్నారు.

నాగపూర్ లో రేడియన్స్ హాస్పిటల్ యాజమాన్యం కరోనా చికిత్సలు నిర్వహించి అధికంగా డబ్బులు వసూలు చేసింది. ఫిర్యాదులు రావడంతో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ రేడియన్స్ కు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎంత మందికి చికిత్స చేశారు, ఎంత వసూలు చేశారంటూ లెక్కలు అడిగింది, మున్సిపల్ నోటీసులను హాస్పిటల్ యాజమాన్యం చెత్తబుట్టలో పడేసింది. స్పందించకపోవడంతో ఆగ్రహించిన కమిషనర్ బాలాజీ శర్మ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయించి నివేదిక తెప్పించారు. రోగుల నుంచి నిర్ణీత మొత్తం కన్నా అధికంగా డబ్బులు తీసుకున్నట్లు విచారణలో తేలింది.

గత వారం రోజులుగా చికిత్స చేయించుకున్న 92 మంది కరోనా రోగులకు రూ.10.32 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితుల నుంచి అదనంగా వసూలుచేసిన సొమ్మును తిరిగి చెల్లించకుండా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని రేడియన్స్ ను హెచ్చరించారు. ఫిర్యాదు వస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.