FbTelugu

అమంచి వ‌ర్సెస్ క‌ర‌ణం!

ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో ఆ ఇద్ద‌రివీ భిన్న‌ధృవాలు. పోటాపోటీగా బ‌రిలోకి దిగి తాడోపేడో తేల్చుకుందామ‌ని స‌వాల్ విసురుకునేవారు. అటువంటిది ఇద్ద‌రూ ఇప్పుడు ఒకే పార్టీలో కొన‌సాగుతున్నారు. ప‌చ్చిగా చెప్పాలంటే వ‌ల‌స నేత‌లు. అయినా ఎవ‌రి ప‌ట్టు వారు నిలుపుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ప్ర‌భుత్వ అధికారులు గుల్ల‌వుతున్నార‌ట‌. చీరాల రాజ‌కీయాలే వేడెక్కాయి. మొన్న‌టి వ‌ర‌కూ టీడీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన క‌ర‌ణం బ‌ల‌రాం ఇటీవ‌ల జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నాడు. అలా అనేకంటే.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం సీఎంను క‌లిశారు. 2024 నాటికి ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్న జ‌గ‌న్‌.. ఈ ద‌ఫా క‌మ్మ‌సామాజిక‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌ల చుట్టూ వ‌ల‌విసిరారు.

టీడీపీ ఆయువుప‌ట్టుగా భావించే వారిని ఆ పార్టీకు దూరం చేయాల‌నే ప‌థ‌క‌ర‌చ‌న‌కు రూప‌మిస్తున్నారు. మొన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ.. నిన్న దేవినేని అవినాష్‌.. ఇప్పుడు క‌ర‌ణం బ‌ల‌రాం.. రేపు ఎవ‌రంటే.. ప్ర‌త్తిపాటి పేరు వినిపిస్తుంద‌నుకోండి. కొద్దిసేపు వాటిని ప‌క్క‌న‌బెడితే.. చీరాల రాజ‌కీయంగా ఎప్పుడూ హాట్‌గా ఉంటుంది. 2014లో వైసీపీ త‌ర‌పున పోటీచేసి గెలిచిన అమంచి కృష్ణ‌మోహ‌న్ త‌రువాత టీడీపీలోకి చేరారు. 2019 ఎన్నిక‌ల ముందు మ‌ళ్లీ వైసీపీలోకి వ‌చ్చారు. కానీ.. ఎన్నిక‌ల్లో క‌ర‌ణం బ‌ల‌రాం చేతిలో ఓడారు. అమంచి చేష్ట‌లు. ఆయ‌న అనుచ‌రుల దందా ఇవ‌న్నీ కూడా ఓట‌మికి కార‌ణాల‌నే గుస‌గుస‌లూ లేక‌పోలేదు. అటువంటి చోట ఇప్పుడు క‌రణం వైసీపీలో యాక్టివ్ కావ‌టంతో ఆమంచికి బ్రేకులు ప‌డ్డాయ‌ట‌. అధికారుల‌కు కూడా ఎవ‌రి మాట వినాల‌నేది అర్ధంకాకుండా ఉంద‌ట‌. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు వ‌ద‌ల‌మంటే పాముకు కోపం అనేంత‌గా ఉంద‌ట వారి ప‌రిస్థితి. మ‌రి దీనికి మ‌ధ్యేమార్గం ఏమిట‌నేది స‌ర్కారు పెద్ద‌లు తేల్చాల్సిందే అంటున్నారు బ‌ల‌రామ‌కృష్ణుల అనుచ‌ర‌గ‌ణం.

You might also like