FbTelugu

లాఠీఛార్జ్… నల్లగొండలో విద్యుత్ కట్

పోలీసు వర్సెస్ ఎలక్ట్రిసిటీ
డిజిపి, జిల్లా ఎస్పితో మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి
నల్లగొండ: లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని సిఎం కెసిఆర్, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించడంతో శనివారం నాడు నల్లగొండ లో పోలీసులు రెచ్చిపోయారు. నల్గొండలో పోలీసులు లాఠీకి పని చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో రోడ్డెక్కిన వారిపై విచక్షణా రహితంగా లాఠీ ఛార్జ్ చేశారు. సమాధానం చెప్పే లోపే బాధితులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. విద్యుత్ అధికారులు, మీడియా ప్రతినిధులను సైతం చితక బాదారు. డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్ లను కూడా వదల్లేదు. పోలీసుల వైఖరికి నిరసనగా నల్గొండ పట్టణంలో విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగులు అహాకారాలు చేస్తున్నారు.

దాడికి దిగిన పోలీసులపై చర్యలు…
నల్లగొండలో కరెంటు సిబ్బంది పై దాడులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, డిజిపి ఎం.మహేందర్ రెడ్డిని కోరారు. విద్యుత్ శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందని, అత్యవసర సర్వీసులకు ఆటంకం కల్పించొద్దని అన్నారు. రాత్రి పగలు అనక పనిచేస్తున్న విద్యుత్ సిబ్బంది పై దాడులు చేసిన వారిని గుర్తించాలన్నారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యహరించాలి, అదే సమయంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా పాటించాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఐడి కార్డులు చూడకుండా లాఠీలకు పని చెప్పొద్దన్నారు. ఆ తరువాత జిల్లా ఎస్పి తో మాట్లాడి కరెంటు సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ జగదీశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.