FbTelugu

పది నిమిషాల్లో పోస్టుమార్టం పూర్తి

న్యూఢిల్లీ: మనిషి ఏదైనా ప్రమాదం లేదా దుర్ఘటనలో చనిపోతే ఆ శవాన్ని పోస్టుమార్టం చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి. అసలే దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఇది మరింత వేదన కలిగిస్తుంది.

అన్ని రంగాల్లో మార్పులు వచ్చిన విధంగా శవ పరీక్ష (అటాప్సీ)లో కూడా నూతన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. చనిపోయిన వారి శరీరంలోని ఎలాంటి భాగాలను కోతవేయకుండానే, ముట్టుకోకుండానే శవ పరీక్ష చేసే విధానం దేశంలో ప్రారంభించారు. ఈ వర్చువల్ విధానం న్యూఢిల్లీలోని ఏయిమ్స్ లో శనివారం అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగాన్ని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ప్రారంభించారు. గౌరవప్రదమైన శవపరీక్ష నిర్వహించేందుకు వర్చువల్ అటాప్సీ రావడం విప్లవాత్మకమని ఏయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధినేత డాక్టర్ సుధీకర్ గుప్తా అన్నారు. ప్రస్తుతం శవపరీక్షకు కనీసం ఆరు గంటల సమయం తీసుకుంటుండగా, నూతన విధానంలో కేవలం పది నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందన్నారు. దీని వల్ల కుటుంబ సభ్యులకు వెంటనే మృతదేహాన్ని అప్పగించడం, వారు కూడా త్వరగా అంత్యక్రియలు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

స్విట్జర్ లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో వర్చువల్ అటాప్సీ విధానం అమలులో ఉంది. దేశంలో తొలిసారి న్యూఢిల్లీ ఏయిమ్స్ లో వాడుకలోకి తెచ్చారు. వర్చుల్ అటాప్సీలో మృతదేహాన్ని బ్యాగ్ లో సీలు చేసి సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ యంత్రంలోకి పంపిస్తారు. నిమిషాల వ్యవధిలోనే శరీరంలోని అన్ని భాగాలు, కణజాలాలకు సంబంధించి పాతిక వేల ఫొటోలను తీసుకుంటుంది. వీటి ద్వారా ఎలా చనిపోయారనేది స్పష్టమవుతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.