FbTelugu

తీగ లాగారు.. డొంక కదులుతుందా..!

తెలంగాణలో రాజకీయం రసకందాయంలో పడింది. సీనియర్‌ మంత్రి ఈటల రాజేందర్‌ను పదవి నుంచి తొలగించడమే కాకుండా ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో వెంటనే చర్యలు తీసుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. కేసీఆర్‌ కావాలనే ఒక బీసీ నేతను టార్గెట్‌ చేశారని ఈటలతో పాటు విపక్ష నేతలు కూడా విమర్శలకు దిగుతున్నారు. ఈటల రాజేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌ నేతలపై.. నేరుగా కేసీఆర్‌నే టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఈటల కేసీఆర్‌ వెంటే ఉన్నారు. దీంతో ఆయనకు పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ ఈటలకు కేసీఆర్‌ మంచి పొజిషనే ఇచ్చారు. కానీ, కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌లో ఎందుకో మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఈటలను కొంచెం కొంచెం దూరం పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి నుంచే బర్తరఫ్‌ చేశారు. అయితే, ఈటల అవినీతికి పాల్పడినందునే ఆయనపై వేటు పడిందని కొందరు రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. కానీ, ఈటల మాత్రం తాను అవినీతికి పాల్పడలేదని.. టీఆర్‌ఎస్‌ పెద్దలే అవినీతికి పాల్పడ్డారని.. వారి అవినీతి చిట్టా అంతా విప్పుతానని వెల్లడించారు.

దీంతో ఈటల ఎవరిమీద గురి పెడతారో.. ఎవరిని టార్గెట్‌ చేస్తారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మంత్రివర్గం నుంచి తప్పించిన రోజే ఈటల విలేకరులతో మాట్లాడుతూ పాత స్కూటర్‌ మీద తిరిగిన వ్యక్తి ఇవాళ వందల కోట్లు ఎలా సంపాదించాడని.. ప్రభుత్వ, ఆసైన్డ్‌ భూముల్లో ఇంజనీరింగ్‌ కట్టుకొని ఇప్పుడు తమను విమర్శిస్తున్నాడని చెప్పాడు. ఈ రెండు విమర్శలు చేసింది ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపైనే అని జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా మంత్రి మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యేపై కూడా అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. బెదిరించి తమ భూములు లాక్కున్నారని అనేకసార్లు రైతులు ఆందోళనలు చేశారు. అయినా స్పందించని సీఎం తన విషయంలోనే ఎందుకు ఇలా చేశారని ఈటల ప్రశ్నిస్తున్నారు. అయితే, వాస్తవానికి ఈటల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చాలాకాలం నుంచి కీలకంగా ఉన్నారు. అధికార వర్గాల్లో కూడా అయనకు అనుచరులు బాగానే ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లోని పెద్దల అవినీతి చిట్టా అంతా ఆధారాలతో సహా ఈటల వద్ద ఉందని.. అందుకే అవినీతి నేతల బండారం బయట పెడతా అని చెబుతున్నారని తెలంగాణలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈటల ఇప్పుడు ఎవరిని ఎప్పుడు టార్గెట్‌ చేస్తారో.. తమ అవినీతి ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో కొందరు మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు వణికిపోతున్నారట. ఇప్పుడు వారి పరిస్థితి వెనక్కిపోతే నుయ్యు.. ముందుకు పోతే గొయ్యిలా తయారైందట. ఈటలతో మంచిగుండి తమ అవినీతి బయటకు రాకుండా మేనేజ్‌ చేసుకుందాం అనుకుంటే ఈటలతో ఎవరు టచ్‌లో ఉంటున్నారన్న విషయంపై సీఎం ఓ కన్నేశారట. దీంతో ఈటలతో టచ్‌లోకి వెళ్లలేక.. తమ అవినీతి బాగోతాన్ని బయటకు రాకుండా చేసుకోలేక సతమతమవుతున్నారట. మొత్తానికి విపక్షాలు మాత్రం టీఆర్‌ఎస్‌ మంత్రులు కబ్జాలకు పాల్పడుతున్నారని తాము ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదని.. ఇప్పుడు వారే బయట పడుతున్నారని చెబుతున్నారు. అవినీతి, భూముల కబ్జాల విషయంలో ఇప్పుడు తీగలాగారు.. మున్ముందు డొంక కదలడం ఖాయమని విపక్ష నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా తయారైందన్న మాట.

You might also like

Leave A Reply

Your email address will not be published.